Rain Alert: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. 5 రోజుల పాటు భారీ వర్షాలు
Rain Alert: ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే తెలంగాణలోకి ప్రవేశించాయి. ఈ క్రమంలో మే నెల చివర్లోనే వర్షాలు కురిశాయి. దీంతో రైతులు వ్యవసాయ పనులను ప్రారంభించారు. కానీ తర్వాత ఒక వారం రోజుల పాటు వానలు పత్తా లేకుండా పోయాయి. మళ్లీ ఎండలు మాడు పగిలేలా దంచి కొట్టాయి. ఈ నేపథ్యంలో ముందుగా విత్తనాలు వేసుకున్న అన్నదాతలు వానల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. రైతన్నల ఆశలు నెరవేరేలా గత రెండు రోజుల నుంచి రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి.
నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుకుగా కదులుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ అధికారులు తెలంగాణకు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. రానున్న 5 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో జోరు వానలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అంతే కాకుండా ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. బలమైన గాలుల నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

దక్షిణ, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవాళ ఉమ్మడి మహబూబ్‌నగర్, నిజామాబాద్, మెదక్, నల్గొండతో పాటు వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ మేరకు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. వర్షాలు పడే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని.. ప్రజలు చెట్ల కింద నిలబడకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications