హైదరాబాద్ తోపాటు పలు ప్రాంతాల్లో వర్షాలు: మరో 4 రోజులు ఈ జిల్లాల్లో జోరు వానలు
హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు మోస్తరు వర్షం కురిసింది. అక్కడక్కడ భారీ వర్షం పడింది. హైదరాబాద్ నగరంలోని శేరిలింగంపల్లి, లింగంపల్లిలో అత్యధికంగా 4 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెంలోని మద్దకూరులో 10 సెం.మీ, యాదాద్రి భువనగిరిలోని నారాయణపూర్‌లో 7.6 సెం.మీ వర్షపాతం నమోదైంది.
మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్ ప్రాంతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మధ్య అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. తెలంగాణ, ఏపీ, కేరళ, తమిళనాడు, కర్నాటక, అండమాన్ నికోబార్ దీవుల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఈశాన్య రుతుపవనాల కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వచ్చే నాలుగు రోజులు హైదరాబాద్, మహబూబ్‌నగర్, వికారాబాద్, నల్గొండ, సూర్యాపేట, నారాయణ పేట, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. మేడ్చల్ మల్కాజిగిరి, వరంగల్, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లోనూ అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని తెలిపారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పారు. రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు 22 డిగ్రీల సెల్సియస్‌గా పడిపోతాయన్నారు. హైదరాబాద్ సహా పొరుగు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతల్లో స్వల్ప తగ్గుదలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు కురుస్తాయని చెప్పారు.












Click it and Unblock the Notifications