రానున్న రెండు మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారం నుంచే ఎండ తీవ్రత పెరగడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. 34 నుంచి 37 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కనిష్టంగా 18 నుంచి 22 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే, రాత్రి సమయంలో మాత్రం వాతావరణం కొంచెం చల్లగా మారడంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు.
కాగా, గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గాయని, సాధారణం కన్నా ఒకటి రెండు డిగ్రీలు మాత్రమే అధికంగా నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. గాలిలో అనిశ్చితి కారణంగా రానున్న రెండు మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

తెలంగాణలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం
మరోవైపు, ఎండ తీవ్రత పెరగడంతో తెలంగాణ వ్యాప్తంగా విద్యుత్ వినియోగం సాధారణం కన్నా భారీగా పెరిగిపోయింది. విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో పెరగడంతో 16వేల మెగావాట్ల మైలురాయిని అధిగమించింది. తెలంగాణలో ఫిబ్రవరి 19 ఉదయం 7.55 గంటలకు16,058 మెగావాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైంది. ఫిబ్రవరి 10న 15,998 మెగావాట్లు నమోదు కాగా, తాజాగా ఆ డిమాండ్‌ను అధిగమించింది.
ఈ క్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యుత్ సంస్థల సీఎండీలతో సరఫరా పరిస్థితిపై సమీక్షించారు. విద్యుత్ డిమాడ్ భారీగా పెరుగుతున్నప్పటికీ రాష్ట్రంలో విద్యుత్ సంస్థలు ఎలాంటి సమస్యలు లేకుండా ధీటుగా ఎదుర్కుంటున్నాయని ఉపముఖ్యమంత్రి తెలిపారు. ఎంతటి డిమాండ్ వచ్చినా సరఫరాలో ఎలాంటి ఆటంకం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. తెలంగాణ ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందన్నారు.












Click it and Unblock the Notifications