కెసిఆర్‌కు చిక్కులు: తలసాని కొనసాగింపుపై రాజభవన్ లేఖ
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగడంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చిక్కులు ఎదుర్కునే పరిస్థితి తలెత్తింది. తలసాని శ్రీనివాస యాదవ్‌ను మంత్రిగా కొనసాగించడంపై రాజభవన్ నుంచి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు ఓ లేఖ అందింది.
తలసానని మంత్రిగా కొనసాగించడంపై వివరణ కోసం రాజభవన్ లేఖ రాయడమే కాకుండా దానికి తెలుగుదేశం పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాసిన లేఖను కూడా జత చేశారు. తమ పార్టీ తరఫున గెలిచిన తలసానిని మంత్రిగా కొనసాగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ టిడిపి నాయకుడు మాగంటి గోపీనాథ్ ఫిర్యాదు చేస్తూ గవర్నర్ నరసింహన్‌కు ఓ లేఖ రాశారు.

ఈ వ్యవహారం కోర్టులో పెండింగులో ఉంది. అయితే తలసాని వ్యవహారం తమ పరిధిలోకి వస్తుందని, కోర్టు పరిధిలోకి రాదని తెలంగాణ అసెంబ్లీ వాదిస్తోంది. ఈ స్థితిలో రాజభవన్ నుంచి రాజీవ్ శర్మకు లేఖ రావడం చర్చనీయాంశంగా మారింది. శాసనసభా సభ్యత్వానికి తాను రాజీనామా చేశానని, అది స్పీకర్ వద్ద పెండింగులో ఉందని తలసాని శ్రీనివాస యాదవ్ చెబుతున్నారు.
రాజభవన్ నుంచి వచ్చి లేఖకు రాజీవ్ శర్మ ఏ విధంగా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరమైన విషయంగా మారింది. దీనిపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఏ విధమైన చర్యలకు దిగుతారనేది కూడా ఆసక్తికరంగానే ఉంది. తలసాని రాజీనామాను స్పీకర్ ఆమోదించే అవకాశాలు కూడా లేకపోలేదనే మాట వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications