రాకేష్ రెడ్డి కిడ్నాప్, హత్య: టెక్కీ బావనే అనుమానితుడు
హైదరాబాద్: హైదరాబాదులో నగరంలోని జవహార్‌నగర్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. రాకేష్ రెడ్డి అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేసి హత్య చేశారు. బుధవారం ఉదయం రాకేష్ రెడ్డి కిడ్నాప్‌కు గురయ్యాడు. కిడ్నాపర్లు రూ.8లక్షలు డిమాండ్ చేశారు. కిడ్నాపర్ల నుంచి ఫోన్ రాగానే రాకేశ్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కిడ్నాప్ చేసిన కొన్ని గంటల్లోనే రాకేశ్‌ను హత్య చేసినట్లు తెలిసింది. రాకేశ్‌ను దుండగులు గొంతుకోసి హత్యచేశారు. స్నేహితుడి ఇంట్లో రాకేశ్ మృతదేహం లభ్యమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు.
తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు క్లూస్ టీమ్స్‌ను, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. బుధవారం రాత్రి జవహర్ నగర్‌లోని సాకేత్ టవర్స్ పక్కన ఉన్న అపార్టుమెంట్లో రాకేష్ రెడ్డి మృతదేహం పోలీసులకు లభించింది.

రాకేష్ రెడ్డి లండన్‌లో ఎంఎస్ పూర్తి చేశాడు. ఇక్కడ స్నేహితులు కూడా తక్కువగా ఉన్నారని, ఈ హత్య వెనక బంధువు హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానించారు. సెల్ టవర్‌ను పోలీసులు గుర్తించారు. రాకేష్ రెడ్డి బుధవారం ఉదయం ఆరు గంటలకు ఇంటి నుంచి వెళ్లాడు. హత్య వెనక రాకేష్ రెడ్డి బావ మహేందర్ రెడ్డి హస్తం ఉందని రాకేష్ రెడ్డి తండ్రి బాల్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. మహేందర్ రెడ్డి ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు.
రాకేష్ రెడ్డి బుధవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల 8 నిమిషాలకు ఆయన తండ్రి బాల్ రెడ్డికి ఎస్ఎంఎస్ మెసేజ్ వచ్చింది. తమకు 8 లక్షల రూపాయలు ఇవ్వాలని, లేకుంటే రాకేష్ రెడ్డిని చంపేస్తామని ఆ మెసేజ్ సారాంశం. అది రాకేష్ రెడ్డి ఫోన్ నుంచే వచ్చింది. అయితే, రాకేష్ రెడ్డికి పలు మార్లు ఫోన్ చేసినా ఫలితం లభించలేదు.
రాత్రికి డబ్బులు ఇవ్వాలని కిడ్నాపర్లు డిమాండ్ చేశారు. అయితే తమ వద్ద అన్ని డబ్బులు లేవని బాల్ రెడ్డి రాత్రి 9 గంటల ప్రాంతంలో మెసేజ్ పంపించాడు. రాకేష్ రెడ్డి బంధువు ఇంటికి వెళ్లి ఉంటాడని భావించిన ఆయన కుటుంబ సభ్యులు జవహర్ నగర్ అపార్టుమెంటుకు వెళ్లారు. అక్కడ రాకేష్ రెడ్డి శవమై కనిపించాడు. దాంతో పోలీసులకు సమాచారం అందించారు.












Click it and Unblock the Notifications