రామోజీ రావుకు తీవ్ర అస్వస్థత: వెంటిలెటర్‌పై చికిత్స
హైదరాబాద్: ఈనాడు సంస్థల అధినేత, రామోజీ గ్రూప్ ఛైర్మన్ చెరుకూరి రామోజీ రావుకు అనారోగ్యానికి గురయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం రామోజీ రావు తీవ్ర అస్వస్థతకు గురవడంతో.. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ శివారులో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీలోని రామోజీ రావు నివాసం నుంచి.. నానక్‌రామ్‌గూడలోని స్టార్ హాస్పిటల్‌కు తరలించారు.
స్టార్ హాస్పిటల్ డాక్టర్లు రామోజీ రావుకు చికిత్స అందిస్తున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. అయితే గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీ రావును తాజాగా ఆస్పత్రిలో చేర్పించారు. కాగా, ఇటీవలే గుండె సంబంధిత వ్యాధుల కారణంగా ఆయనకు వైద్యులు స్టంట్స్ వేసినట్లు సమాచారం.

ప్రస్తుతం 87 ఏళ్ల రామోజీ రావు ఆరోగ్య పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది. రామోజీ రావు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉంది. వైద్యుల హెల్త్ బులిటెన్ కోసం ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు, సంస్థ సిబ్బంది ఎదురుచూస్తున్నారు.
మరోవైపు, రామోజీరావు తీవ్ర అస్వస్థకు గురయ్యారన్న వార్త తెలియడంతో పలువురు ప్రముఖులు, ఆయన శ్రేయోభిలాషులు స్పందిస్తున్నారు. రామోజీ రావు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. అస్వస్థతకు గురైన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రజాపక్షమై అక్షరాన్ని నిలిపిన మార్గదర్శి మీరు. సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్లు సమాజ క్షేమం కోసం మీరు పనిచేయాలని ప్రజలంతా తమ ఇష్టదైవాలను ప్రార్థిస్తున్నారు అని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications