మహేశ్వర్ రెడ్డి పిటిషన్ స్వీకరించండి: స్పీకర్‌కు హైకోర్టు కీలక ఆదేశాలు
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై చర్యలు తీసుకోవాలంటూ చేసిన ఫిర్యాదును స్పీకర్ తీసుకోలేదంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపు అంశంపై తెలంగాణ హైకోర్టు గురువారం మరోసారి విచారణ జరిపింది.
స్పీకర్ తన ఫిర్యాదును స్వీకరించేలా ఆదేశించాలని మహేశ్వర్ రెడ్డి కోర్టును కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు ధర్మాసనం.. మహేశ్వర్ రెడ్డి పిటిషన్‌ను తీసుకోవాలని, పిటిషనర్‌కు ధృవీకరణ రశీదు ఇవ్వాలని స్పీకర్ కార్యాలయాన్ని హైకోర్టు ఆదేశించింది.

మరోవైపు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలపై దాఖలు చేసిన పిటిషన్లపైనా విచారణ జరిగింది. స్పీకర్ నిర్ణయం తీసుకోక ముందే పిటిషనర్లు కోర్టుకు వచ్చారని ఏజీ పేర్కొన్నారు. స్పీకర్ ఇండిపెండెంట్ ట్రైబ్యునల్ అని.. కోర్టుల జోక్యం ఉండదన్నారు. గతంలో సుప్రీంకోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని ఏజీ తెలిపారు.
మూడు నెలలైనా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్న వాదన సరైంది కాదని వ్యాఖ్యానించారు. వివాదం కోర్టులో ఉన్నందున స్పీకర్.. పిటిషన్లను పరిశీలించలేదని ఏజీ చెప్పుకొచ్చారు. స్పీకర్.. కోర్టు నిర్ణయం కోసం వేచి చూస్తూ ఉండొచ్చన్నారు. ఈ క్రమంలో తదుపరి విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.
కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపాలై కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 9 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీలు కోర్టును ఆశ్రయించాయి.












Click it and Unblock the Notifications