రికార్డు ధర పలుకుతున్న పసుపు: నిజామాబాద్ రైతుల్లో ఆనందం, కేంద్ర నిర్ణయమే కారణం
నిజామాబాద్: పసుపు పంటకు రికార్డు ధర పలుకుతోంది. ఈ సీజన్లో ముందు నుంచి జోరు మీదున్న ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం నాటి రికార్డు తాజాగా గురువారం బ్రేక్ అయ్యింది. ఇవాళ క్వింటా పసుపు ధర గరిష్టంగా రూ. 15,025 పలికింది. ఈ సీజన్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం.
ఫలితంగా కొన్నేళ్లుగా అరకొర ధరలతో కుదేలైన అన్నదాత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏటా పసుపు విస్తీర్ణం తగ్గిస్తూ సాగుకు దూరమవుతున్న తరుణంలో ప్రస్తుత ధరలు పసుపు రైతులకు మళ్లీ జీవం పోస్తున్నాయి. కాగా, నిజామాబాద్ మార్కెట్లో 2011 తర్వాత ఇంత ధర పలకడం ఇదే తొలిసారి అని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.

2011లో క్వింటా పసుపు ఆల్‌టైమ్ రికార్డు ధర రూ.16,166 పలికింది. ఆ తర్వాత నుంచి ప్రతి ఏటా రూ.6-7 వేల మధ్యనే పసుపు ధరలు పలికాయి. ఈ సీజన్లో మాత్రం క్రమంగా ధరలు పుంజుకున్నాయి. గత ఏడాది పదివేల వరకు ధరలు రాగా, ఈ సీజన్లో మాత్రం అధిక ధరలు వస్తున్నాయి.
కాగా, కేంద్రం పసుపు దిగుమతులను నియంత్రించడంతో క్రమంగా డిమాండ్ పెరుగుతూ వచ్చింది. ఈ సీజన్లో ఆ ఫలితాలు కనిపిస్తున్నాయి. 15 వేల ధర ఉంటే గిట్టుబాటు అవుతుందని మొదట్నుంచీ రైతులు చెబుతూ వచ్చారు. గతంలో ఏటా 6 వేలు, 7 వేల మధ్యనే ధరలు పలికేవని. ఈ సీజన్‌లో క్రమంగా ధరలు పుంజుకోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ః
పదేళ్లలో ఈ ధర రావడం ఇదే తొలిసారని మళ్లీ పసుపు పంటకు జిల్లాలో పూర్వవైభవం వస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పసుపు ధరలను ఇలాగే కొనసాగిస్తే జిల్లాలో రానున్నరోజుల్లో పసుపు పంట విస్తీర్ణం మరింత పెరిగే అవకాశముందంటున్నారు రైతులు.












Click it and Unblock the Notifications