విద్య సంస్థలు బంద్.. ఎందుకంటే...?
తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో గత కొన్ని గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విలయాన్ని సృష్టించాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో జిల్లాలోని వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రికార్డు స్థాయిలో 41 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని, విద్యాశాఖ అధికారులు గురువారం అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
ఈ వర్షం కారణంగా కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు, కాలనీలు నీట మునిగిపోయాయి. రైల్వే ట్రాక్‌లు కూడా దెబ్బతినడంతో కొన్ని రైళ్లను రద్దు చేయగా, మరికొన్నింటిని దారి మళ్లించారు. దీంతో రైల్వే ప్రయాణీకులకు కూడా ఇబ్బందులు తప్పలేదు.

వరి పంటలు పూర్తిగా నీట మునిగిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టంతో లబోదిబో మంటున్నారు. అసాధారణ స్థాయిలో కురిసిన ఈ వర్షం, జిల్లాలో సాధారణ జనజీవనాన్ని పూర్తిగా స్తంభింపజేసింది. అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.












Click it and Unblock the Notifications