తెలంగాణలో రెడ్ అలర్ట్.. మరింత పెరగనున్న సూర్యప్రతాపం..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మండే ఎండలతో ప్రజలను అల్లాడిస్తున్నాడు. ఇక, రాబోయే రెండు మూడు రోజుల్లో విపరీతమైన ఎండలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రాబోయే రోజుల్లో వీటి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇక, నేడు రాష్ట్రంలోని 13 జిల్లాలకు, వచ్చే రెండు రోజుల్లో 18 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో తీవ్ర వేడిగాలులు ప్రభావం ఉంటుందని అధికారులు గురువారం రిలీజ్ చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు.
నిన్న (మే 2) గురువారం తెలంగాణలోని 8 జిల్లాల్లో 46 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయిని అధికారులు తెలిపారు. అత్యధికంగా నల్గొండ జిల్లా ఇబ్రహీంపేటలో 46.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. నల్గొండ జిల్లాలోని 22 మండలాల్లో 45 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఇబ్రహీంపేట 46.6, సూర్యాపేట జిల్లా మునగాలలో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత, జగిత్యాల జిల్లా నేరెళ్ల, వెల్గటూరు, నల్గొండలోని నాంపల్లిలో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత, మంచిర్యాల జిల్లాలోని జన్నారంలో 46.3 డిగ్రీలు, నల్గొండ జిల్లాలోని కేతేపల్లి, మాడుగులపల్లి, తెల్దేవరపల్లి, సుగ్లాంపల్లి 46.2 డిగ్రీల చొప్పున టెంపరేచర్ రికార్డయింది. రాష్ట్రంలోని 22 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల మధ్య నమోదయినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఈ నెల 7,8 తేదీల్లో పలు జిల్లాల్లో వర్షాలు..
ఇక, మే 5వ తేదివరకు పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కరీంనగర్, ఖమ్మం, కుమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల, సూర్యాపేట, వనపర్తి, వరంగల్ జిల్లాల్లో 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు, వడగాలుల ప్రభావం అధికంగా ఉండబోతుందని అధికారులు అంటున్నారు. ఇదిలా ఉండగా, ఈనెల 7, 8వ తేదీల్లో పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు పేర్కొంది.












Click it and Unblock the Notifications