రిజిస్ట్రేషన్లు రద్దు చేసే అదికారం తహసిల్దారుకెక్కడిది..? ప్రభుత్వ ఉత్తర్యులను తప్పుబట్టిన హైకోర్ట్
హైదరాబాద్ : మియాపూర్ భూ వ్యవహారం మరో సారి తెరమీదకు వచ్చింది. ఆ భూముల వ్యవహారంలో ప్రభత్వం వ్యవహరించిన తీరును ఆసాంతం హైకోర్ట్ తప్పుబట్టింది. భూమిపై ప్రభుత్వానికి హక్కులున్నాయనుకుంటే సివిల్ కోర్టులో దావా వేసుకుని హక్కులు పొందాలని అంతేగానీ అధికారం ఉందని యాజమాన్య హక్కులు తేలకుండానే ఇతరుల విక్రయ దస్తావేజులను రద్దు చేయడం సరికాదని హైకోర్టు తప్పుబట్టింది. వివాదాస్పదమైన మియాపూర్ భూముల వ్యవహారంలో జీపీఏ రిజిస్ట్రేషన్‌లను రద్దు చేస్తూ శేరిలింగంపల్లి తహసీల్దారు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

రిజిస్ట్రేషన్లను తహసీల్దారు ఎలా రద్దు చేస్తారు..? సూటిగా ప్రశ్నించిన హైకోర్ట్..!!
జాగీరు భూములకు సంబంధించి 2017 మే 25, 2016 జనవరి 15న రిజిస్టరైన డాక్యుమెంట్‌లను రద్దు చేస్తూ శేరిలింగంపల్లి తహసీల్దారు ఇచ్చిన ఉత్తర్వులపై పి.ఎస్.పార్థసారథి, సువిశాల్ పవర్ జెన్ లిమిటెడ్‌లు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్‌లను సింగిల్ జడ్జి కొట్టివేసిన విషయం విదితమే. రిజిస్ట్రేషన్‌లను రద్దు చేసే అధికారం తహసీల్దారుకు లేదంటూనే, ఆ ఉత్తర్వులను సమర్థిస్తూ సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ పార్థసారథి, సువిశాల్ పవర్‌జెన్ లిమిటెడ్‌లు వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశాయి. వీటిపై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిల ధర్మాసనం విచారణ చేపట్టింది. టైటిల్ రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని నిర్ణయించాక సింగిల్ జడ్జి తదుపరి ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉందని పేర్కొంది.

హక్కు ఉందనుకుంటే సివిల్ కోర్టును ఆశ్రయించండి..! రద్దుచేసి పొందడం ఏంటన్న కోర్ట్..!!
అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ వాదనలు వినిపిస్తూ సనద్ డీడ్స్ పేరుతో 265 కోట్ల రూపాయల స్టాంపు డ్యూటీ ఎగ్గొట్టారన్నారు. వీరు సబ్‌రిజిస్ట్రార్‌లతో కలిసి మోసానికి పాల్పడ్డారన్నారు. వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని వాటిపై విచారణ కొనసాగుతోందని చెప్పారు. సర్వే నెం.20, 28, 44, 45, 100, 101ల్లోని ప్రభుత్వ భూములను విక్రయించారన్నారు. ఈ భూమి ప్రభుత్వానిదేనంటూ భూఆక్రమణల నిరోధక ప్రత్యేక కోర్టు, హైకోర్టులు తీర్పులు వెలువరించాయన్నారు.

మియాపూర్ భూములపై హైకోర్టు జోక్యం..! సింగిల్ జడ్జి ఉత్తర్వుల అమలు నిలిపివేత..!!
ఈ పిటిషన్‌లలో పిటిషనర్లు పార్టీలు కాదని, వీరు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారని చెప్పారు. సబ్‌రిజిస్ట్రార్‌ను అరెస్ట్ చేశామని చెప్పారు. ఈ దశలో తహసీల్దారు నిర్ణయం తప్పని చెబితే వీటి ప్రభావం ఆ కేసులపై ఉంటుందన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ స్టాంపు డ్యూటీ ఎగవేత వంటి చట్టవిరుద్ధమైన కేసుల్లో విచారణ కొనసాగడానికి ఈ ఉత్తర్వులు అడ్డంకి కాదంది. ఏజీ వాదనలు కొనసాగిస్తూ పిటిషనర్లు మోసానికి పాల్పడ్డారని, సనద్ డీడ్స్ పేరుపై హక్కులు పొంది ఇప్పటికే 4 రిజిస్ట్రేషన్‌లతో ఇతరులకు అన్యాక్రాంతం చేశారన్నారు.

యథాతథస్థితిని కొనసాగించాలంటూ ఆదేశాలు..! అర్థంకాని పరిస్థితిలో ప్రభుత్వం..!!
ఈ దశలో పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ జోక్యం చేసుకుంటూ ఈ భూములపై లావాదేవీలు నిర్వహించబోమని హామీ ఇస్తామన్నారు. చట్టవిరుద్ధంగా రిజిస్ట్రేషన్‌లు చేసినా వాటిని రద్దు చేసే అధికారం తహశీల్దారుకు లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. టైటిల్ వివాదం ఉంటే సివిల్ కోర్టుల్లో తేల్చుకోవాలంది. ప్రభుత్వ ప్రయోజనాలు దెబ్బతినకుండా ఈ భూములపై లావాదేవీలు నిర్వహించకుండా నిషేధం విధిస్తామని తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడేదాకా యథాతథస్థితిని కొనసాగించాలని, అనుభవంలో ఉన్నవారి వద్దే భూములుండవచ్చని హైకోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టులో కేసు తేలేదాకా ఈ పిటిషన్‌లపై విచారణను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.












Click it and Unblock the Notifications