3న తెలంగాణ ఎన్నికల ఫలితాలు: హైదరాబాద్‌లో ఆంక్షలు, వాటిపై నిషేధం
హైదరాబాద్ : డిసెంబర్ 3 అంటే ఆదివారంనాడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా లెక్కింపు కేంద్రాల వద్ద ఆంక్షలు విధించారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య, రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్‌లు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆంక్షలు 3వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 4వ తేదీ ఉదయం 6 గంటల వరకు అమలులో ఉండనున్నాయి.
ఇక ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. నిషేధిత కర్రలు, లాఠీలు, పేలుడు పదార్ధాలు, ఆయుధాలతో తిరగడాన్ని నిషేధించారు. మైక్‌లు, మ్యూజిక్ సిస్టమ్, ప్రసంగాలు చేయడం, నిషేధిత ఫోటోలు, సింబల్స్, ప్లకార్డులు ప్రదర్శించకూడదని ఆదేశించారు.

విధి నిర్వహణలో ఉన్న పోలీసు, మిలటరీ, ఎలక్షన్ అధికారులకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుందన్నారు. రోడ్లు, బహిరంగ ప్రదేశాలలో టపాసులు కాల్చడంపై నిషేధం విధించారు. అలాగే ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆదివారం మద్యం దుకాణాలను మూసివేయాలని సీపీ సందీప్ శాండిల్య ఆదేశాలు జారీ చేశారు.
పోలీసు సిబ్బందికి సీపీ అభినందనలు
పోలింగ్ రోజు(నవంబర్ 30)న ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించడంతోపాటు రిగ్గింగ్ జరగకుండా అడ్డుకున్న సిబ్బందిని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య అభనిందించారు. అంతేగాక, వారికి రివార్డులు అందజేశారు. షాఇనాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వేర్వేరు పార్టీలకు చెందిన కార్యకర్తలు ఘర్షణకు దిగగా.. ఎన్నికల విధుల్లో ఉన్న ఎస్సై అంబిక వెంటనే అక్కడికి వెళ్లి వారిని అడ్డుకున్నారు. సకాలంలో సమాచారాన్ని షా ఇనాయత్ గంజ్ పోలీసులకు తెలియజేశారు. దీంతో అదనపు బలగాలు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితులను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చాయి.
మరోవైపు, సిటీ సెక్యూరిటీ వింగ్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న వినయ్ కుమార్.. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పోలింగ్ బూత్ లో దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన వారిని పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అదే విధంగా ఫలక్ నుమా స్టేషన్ మహిళా కానిస్టేబుల్ కుమారి భోస్లే కాలాపత్తర్ స్టేషన్ పరిధిలో ఎన్నికల విధుల్లో నిర్వర్తిస్తూ దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన వారిని గుర్తించి అరెస్ట్ చేశారు. ఇలా పోలింగ్ సజావుగా సాగేందుకు సమర్థవంతంగా పనిచేసిన సిబ్బందిని అభినందించిన సీపీ.. రివార్డులు కూడా అందజేశారు.












Click it and Unblock the Notifications