రెండు విడతల్లో రైతు రుణమాఫీ - ఎవరికి ఎప్పుడంటే..!!
తెలంగాణలో రైతు రుణమాఫీ పై ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ఆగస్టు 15 లోగా రైతు రుణమాఫీ పూర్తి చేస్తామని రేవంత్ ప్రమాణం చేసారు. దీంతో, రుణమాఫీ అమలు మార్గదర్శకాల పైన అధికార యంత్రాంగం ఫోకస్ చేసింది. బ్యాంకర్లతోనూ చర్చలు కొనసాగుతున్నాయి. విడదల వారీగా రుణమాఫీ అమలు పైన సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లో నే అధికారికంగా నిర్ణయం వెలువడనుంది.
ప్రభుత్వం కసరత్తు
తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీకి సిద్దం అవుతోంది. జులై 15 నుంచి దశలవారీగా రుణమాఫీ చేయాలని సూచనప్రాయ నిర్ణయం తీసుకున్నారు. గడువు సమీపిస్తుండటంతో రైతు రుణమాఫీకి ప్రభుత్వం కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. జులై 15 నుంచి రూ.50వేల లోపు, ఆ తర్వాత రూ. 75వేలు, రూ.లక్ష.. ఇలా పెంచుతూ బ్యాంకులకు జమ చేసే విధానాన్ని పరిశీలిస్తోంది. రైతుల్లో 70 శాతం మందికి రూ. లక్ష లోపు రుణం ఉన్నట్లు అంచనా. తొలి దశలో వీరికి మాఫీ చేసి మిగిలిన వారికి ఆగస్టు 15లోగా జమ చేయాలనే అంశంపైనా చర్చ సాగుతోంది. రైతుల రుణమాఫీ అమలు కోసం వృథాగా ఉన్న ప్రభుత్వ భూములను బ్యాంకుల్లో కుదువపెట్టి లోన్లు తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

నిధుల కోసం మార్గాలు
ఇక అటు రైతు భరోసా, రుణమాఫీ, రైతు బీమా పథకాలకు 2 నెలల్లో రూ. 30 వేల కోట్లు అవసరమని ప్రభుత్వ వర్గాల అంచనా. ఆగస్టులోగా ఆ మేర రుణాలు తీసుకుంటేనే స్కీమ్ ల అమలు సాధ్యమని సమాచారం. బాండ్ల విక్రయం ద్వారా అప్పు తీసుకోవాలని నిర్ణయించింది. అయితే ఏప్రిల్, మేలో రూ. 8,246 కోట్లు సేకరించగా.. మరో రూ. 2వేల కోట్లు 3 రోజుల్లో తీసుకొనుంది. ఈ ఏడాది కోటాలో మరో రూ. 30 వేల కోట్లు తీసుకునేందుకు ఆర్బీఐ అంగీకరిస్తుందా అనేది సందేహాంగా మారుతోంది. దీంతో, బ్యాంకుల్లో కుదువపెట్టి లోన్లు తీసుకోవాలని భావిస్తున్నది. ఇట్లయితే రైతుల పంట రుణాలన్నీ ఒకేసారి మాఫీ చేయొచ్చని, ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే తనఖాపెట్టిన భూములను మెల్లమెల్లగా విడిపించుకోవచ్చని ఆలోచన చేస్తున్నది.
విడతల వారీగా అమలు
ఆగస్టు 15వ తేదీలోగా రూ.2 లక్షల లోపు క్రాప్ లోన్లు మాఫీ చేస్తామని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. ఈ క్రమంలో నిధుల సర్దుబాటు కోసం అన్ని మార్గాలను సర్కార్ అన్వేషిస్తున్నది. ఆర్థిక శాఖ ఇప్పటికే పలు ప్రతిపాదనలను సీఎం రేవంత్ రెడ్డి ముందుంచింది. కొన్ని భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టడం ద్వారా కనీసం రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల వరకు ఏకకాలంలో సమకూర్చుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆర్బీఐ గవర్నర్తో ఉన్నతాధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఒకటి, రెండు రోజుల్లో ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications