హైదరాబాద్ అభివృద్ధిలో కేసీఆర్ కృషి: విజన్ 2050 అంటూ సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్ తీసుకువస్తున్నామన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. త్వరలో 2050 విజన్ దిశగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడలో అగ్నిమాపక శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయం, కమాండ్ కంట్రోల్‌ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. అగ్నిమాపక శాఖ కేవలం అగ్ని ప్రమాదాల నివారణ కోసమే కాదని, విపత్కర పరిస్థితుల్లో కూడా వీరి సేవలు అమూల్యమని ప్రశంసించారు.
అగ్నిప్రమాదాల్లో ప్రాణాలకు తెగించి ప్రజల ప్రాణాలు కాపాడే ఫైర్ సిబ్బంది సేవలు మరవలేనివన్నారు సీఎం రేవంత్. ఎన్నో వేలాది నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే అగ్నిమాపక శాఖకు భవనం లేకపోవడం సరికాదన్నారు రేవంత్‌రెడ్డి. ఏ నగరంలో శాంతి భద్రతలు ఉంటాయో అక్కడ అభివృద్ధి చెందుతుందని సీఎం చెప్పారు.

హైదరాబాద్ ప్రపంచంతో పోటీ పడుతోందని, పెట్టుబడులకు అనువైన ప్రాంతమన్నారు. గత ముప్పై ఏళ్లలో రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ, నగర అభివృద్ది కొనసాగిందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గత ముప్పై ఏళ్లుగా హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు, వైఎస్‌ఆర్, కేసీఆర్ ఎంతో కృషి చేశారని రేవంత్ వ్యాఖ్యానించారు. రాజకీయాలకు అతీతంగా వారు తీసుకున్న నిర్ణయాలు, అనుభవాలను తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందన్నారు.
హైదరాబాద్‌కు ముందుగా ఔటర్ రింగ్ రోడ్డును ప్రతిపాదనను చంద్రబాబు తీసుకువచ్చారని, దాన్ని కొనసాగిస్తూ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పూర్తి చేశారని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రీజినల్ రింగ్ రోడ్డును త్వరలోనే తీసుకువస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు. రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో రైల్ సదుపాయం కూడా కల్పిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్దికి మెగా మాస్టర్ ప్లాన్ తీసుకువస్తున్నామని చెప్పారు.
త్వరలో 2050 విజన్ దిశగా తాము ముందుకు వెళ్లనున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. అర్బన్, రూరల్ తెలంగాణను అభివృద్ధి చేస్తామని అన్నారు.హైదరాబాద్ నగరం ప్రపంచంతో పోటీ పడుతోందని, ఇక్కడ పెట్టుబడులకు అనువైన ప్రాంతమని, అందుకే మహానగరాన్ని అర్బన్, సెమీ అర్బన్, రూరల్ మూడు భాగాలుగా అభివృద్దిలో ముందుకు తీసుకెళ్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు.
ఫార్మాసిటీ కట్టలేదని కొంత మంది ఆరోపణలు చేస్తున్నారని.. ఒకే చోట కాకుండా 10-15 ప్రాంతాల్లో ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు చేస్తామని, కానీ, ఒకేచోట 25 ఎకరాల్లో ఫార్మాసిటీ ఉంటే నగరం కలుషితం అవుతుందని రేవంత్ వివరించారు. అవగాహన లేకుండా నిర్ణయాలు తీసుకుంటే, మేడిగడ్డ వలే అవుతుందని గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు.












Click it and Unblock the Notifications