అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలుగువాళ్లు మృతి
భారత్ నుంచి నిత్యం వేల మంది విద్యార్థులు ఉన్నత చదువులు, ఉపాధి, ఉద్యోగం కోసం వెళ్తుంటారు. దేశంలోని అనేక మంది విద్యార్థులు అమెరికా వెళ్లడం డ్రీమ్ గా పెట్టుకుంటారు. అక్కడికి వెళ్లి డబ్బు సంపాదించి తల్లిదండ్రులకు పంపించాలని కలలు కంటుంటారు. అమెరికాలో ప్రస్తుతం భారతీయ విద్యార్థుల సంఖ్య 3. 31 లక్షలు దాటినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లినవారే దాదాపు 51 శాతం మంది ఉండటం గమనార్హం. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు అమెరికాలో దాదాపు లక్షా 85 వేల మందికి పైగా ఉన్నారు.
అయితే అమెరికాలో ఉద్యోగం కోసం తెలంగాణ నుంచి వెళ్లిన ఓ కుటుంబం అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. అమెరికాలోని సెయింట్ ఫ్రాన్సిస్ ప్రాంతంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తెలంగాణ వాసులు మృతి చెందారు. మృతులంతా హైదరాబాద్ ఐఎస్ సదన్ లోని వాణినగర్ కు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో తల్లి నజేయా(45), కుమార్తె నిహాయీన్(19), కుమారుడు ఉమర్(14) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అలాగే భర్త షేక్ అబ్దుల్ నవీద్, మరో కుమార్తె ఖదీజాకు తీవ్రగాయాలు అయ్యాయి. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది.

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో ఐఎస్ సదన్ లోని వాణినగర్ లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ సమాచారం తెలుసుకున్న బంధువులు, సన్నిహితులు నవీద్ నివాసానికి చేరుకున్నారు. యాకుత్ పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మంగళవారం సాయంత్రం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.












Click it and Unblock the Notifications