ప్రముఖ జ్యూవెలరీ షాప్ లో 10కోట్ల విలువైన బంగారం స్వాధీనం.. ఎందుకో మీకూ తెలియాలి
వరంగల్‌లోని ఓ ఆభరణాల దుకాణంపై బీఐఎస్ హైదరాబాద్ శాఖ కార్యాలయ అధికారులు సోదాలు నిర్వహించారు. బీఐఎస్ చట్టం-2016 నిబంధనలు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తప్పనిసరి హాల్‌మార్కింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ తనిఖీలు చేపట్టారు. బీఐఎస్ హైదరాబాద్ శాఖ డైరెక్టర్ పి.వి. శ్రీకాంత్ ఆదేశాల మేరకు డిప్యూటీ డైరెక్టర్లు కె. కవిన్, విజయరాజ్ బర్బర్ ఆధ్వర్యంలో బీఐఎస్ బృందం ఈ దాడులు నిర్వహించింది.
రూ.10 కోట్లు విలువైన గోల్డ్ సీజ్
తనిఖీల సందర్భంగా తప్పనిసరి బీఐఎస్ హాల్‌మార్క్ లేకుండా విక్రయానికి ఉంచిన భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు అధికారులు గుర్తించారు. ఇది బీఐఎస్ చట్టం-2016 నిబంధనలకు విరుద్ధమని అధికారులు తెలిపారు.దాడుల్లో నెక్లెస్ సెట్లు, ఉంగరాలు, గొలుసులు, చెవి దిద్దులు తదితర కలిపి సుమారు 7.875 కిలోల హాల్‌మార్క్ లేని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.10 కోట్లు ఉంటుందని అంచనా.

బంగారు ఆభరణాలకు బీఐఎస్ హాల్‌మార్కింగ్ తప్పనిసరి
సంబంధిత సంస్థపై బీఐఎస్ చట్టం-2016 ప్రకారం చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. దీనిపై బీఐఎస్ హైదరాబాద్ డైరెక్టర్ & హెడ్ పి.వి. శ్రీకాంత్ మాట్లాడుతూ, తెలంగాణలో బంగారు ఆభరణాలకు బీఐఎస్ హాల్‌మార్కింగ్ తప్పనిసరి అని తెలిపారు. ఆయా జిల్లాల్లోని స్వర్ణాభరణాల వ్యాపారులు నిజమైన హెచ్‌యూఐడీతో కూడిన బీఐఎస్ హాల్‌మార్క్ బంగారు ఆభరణాలను మాత్రమే విక్రయించాలని, బీఐఎస్ చట్టంలోని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
బీఐఎస్ హాల్‌మార్క్ బంగారు ఆభరణాలను మాత్రమే కొనాలి
వినియోగదారులు కూడా హెచ్‌యూఐడీ ఉన్న బీఐఎస్ హాల్‌మార్క్ బంగారు ఆభరణాలను మాత్రమే కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసే ముందు బీఐఎస్ కేర్ (BIS CARE) యాప్‌లో హెచ్‌యూఐడీ నంబర్‌ను ధృవీకరించాలని, తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హాల్‌మార్క్ దుర్వినియోగం లేదా హెచ్‌యూఐడీ లేని ఆభరణాల విక్రయం కనిపిస్తే బీఐఎస్ కేర్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.
బీఐఎస్ కేర్ యాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు
వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ, చట్టపరమైన నిబంధనల అమలు, ఆభరణాల రంగంలో నాణ్యత, పారదర్శకత కోసం బీఐఎస్ ఇటువంటి తనిఖీలు, అమలు చర్యలను నిరంతరం కొనసాగిస్తుందని తెలిపారు. అసలైన బీఐఎస్ హాల్‌మార్క్ బంగారు ఆభరణాలపై బీఐఎస్ లోగో, స్వచ్ఛత గుర్తు, ఆరు అంకెల హెచ్‌యూఐడీ తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. హెచ్‌యూఐడీ నంబర్‌ను బీఐఎస్ కేర్ యాప్ ద్వారా నమోదు చేసి హాల్‌మార్క్ అసలుదా కదా అన్నది సులభంగా ధృవీకరించవచ్చని తెలిపారు.
బీఐఎస్ కేర్ మొబైల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి
హాల్‌మార్కింగ్ దుర్వినియోగం లేదా హెచ్‌యూఐడీ లేని బంగారు ఆభరణాల విక్రయం ఎక్కడైనా గుర్తించినట్లయితే బీఐఎస్ కేర్ మొబైల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు. బీఐఎస్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం www.bis.gov.in లేదా e-BIS (manakonline.in) వెబ్‌సైట్లను సందర్శించవచ్చని సూచించారు.












Click it and Unblock the Notifications