రేవంత్ రెడ్డి, వైఎస్ షర్మిలది ఒకే డిమాండ్
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్‌కు తన పాలనపై నమ్మకం ఉంటే.. సిట్టింగులందరికీ సీట్లివ్వాలన్నారు. అంతేగాక, కేసీఆర్ కూడా గజ్వేల్ నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. గజ్వేల్‌లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని.. అక్కడ కూడా తమ పార్టీనే గెలుస్తుందని రేవంత్ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీలో చేరికలు:కాంగ్రెస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లు రవి, గద్వాల జిల్లా పరిషత్ ఛైర్మన్ సరిత, ఆమె భర్త తిరుపతయ్య ఆధ్వర్యంలో గద్వాల నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన 30 మంది సర్పంచ్‌లు, 12 మంది ఎంపీటీసీలతోపాటు పలువురు నాయకులకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. గద్వాల జిల్లా అమ్మవారి బంగ్లాలో బందీ అయ్యిందని ఆరోపించారు. గద్వాల ప్రజలను బంగ్లా ముందు బానిసలుగా మార్చారన్నారు. పాలమూరు వెనకబడ్డ జిల్లా కాదు.. వెనుకబడిన వారిని నడిపించే జిల్లాగా చాటాలని పిలుపునిచ్చారు. గద్వాల కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని రేవంత్ అన్నారు. పాలమూరులో అన్ని ఎమ్మెల్యే స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామని పిలుపునిచ్చారు.
కేసీఆర్‌కు షర్మిల సవాల్
దమ్ముంటే సిట్టింగ్‌లకు మళ్లీ సీట్లు ఇచ్చి ఎన్నికల బరిలో నిలపాలని సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సవాల్ విసిరారు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ట్విట్టర్ వేదికగా ఆమె కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. 'ఉద్యమ సెంటిమెంట్ తో మొదటిసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన దొర గారు.. రెండోసారి తెలంగాణ ఆత్మగౌరవం పేరుతో కుర్చీని కాపాడుకున్నారు. తొమ్మిదేండ్ల నుంచి అవినీతి ఏరులై పారించి, ఇచ్చిన హామీలన్నీ ఎగ్గొట్టాడు' అంటూ మండిపడ్డారు.
'కుటుంబానికి పదవులు కట్టబెట్టి, ఉద్యమ ద్రోహులను నెత్తిన పెట్టుకున్నాడు. ఇన్నాళ్లు దొర గారు దర్జాగా గడీల్లో ఉంటే.. ఎమ్మెల్యేలు బందిపోట్ల లెక్క ప్రజల మీద పడి దోచుకున్నారు. కబ్జాలకు,అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. ప్రశ్నించిన వాళ్లను చితకబాదారు. ఎన్నికలొచ్చే సరికి సొంత పార్టీ ఎమ్మెల్యేలపై జనం గుర్రుగా ఉన్నారని తెలుసుకున్న దొర గారు ఉలిక్కిపడుతున్నారు' అని వ్యాఖ్యానించారు షర్మిల.
'సిట్టింగులకు సీట్లు అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే... సర్వేల పేరుతో హడావిడి చేస్తున్నాడు. ఎమ్మెల్యేలను మారిస్తే తప్ప తాను గట్టెక్కలేనని తెలుసుకున్నాడు. దొర కేసీఆర్ కి YSR తెలంగాణ పార్టీ సవాల్ విసురుతోంది. మీది అవినీతిరహిత పాలనే అయితే, హామీలు నెరవేర్చి ఎన్నికల మ్యానిఫెస్టోకి న్యాయం చేసిన వారే అయితే, మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇచ్చి ఎన్నికల బరిలో నిలవండి. మీరు, మీ ఎమ్మెల్యేలు సుద్ధపూసలు అయితే గెలిచి మీ పాలనకు ఇది రెఫరెండం అని ప్రూవ్ చేయండి. కేసీఆర్ గారు దమ్ముంటే ఈ సవాల్ స్వీకరించండి' అంటూ ట్విట్టర్ వేదిక షర్మిల పేర్కొన్నారు. కాగా, రేవంత్, షర్మిల కేసీఆర్‌కు ఒకే తరహా సవాల్ ఇవ్వడం గమనార్హం.












Click it and Unblock the Notifications