రైతులకు 24గంటల ఉచిత విద్యుత్‌పై రేవంత్ రెడ్డి మరో ట్వీట్!!
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికార బి ఆర్ ఎస్ పార్టీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ పై చేసిన వ్యాఖ్యలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందాలని ప్రయత్నిస్తుంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించటంతో పాటు తెలంగాణ రాష్ట్ర మంత్రులు, నేతలు రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. ఇక రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారని కాంగ్రెస్ నేతలు కూడా ఎదురుదాడి చేస్తున్నా బీఆర్ఎస్ మాత్రం రేవంత్ రెడ్డిని పదేపదే టార్గెట్ చేస్తుంది. దీంతో తాజాగా రేవంత్ రెడ్డి తనపై జరుగుతున్న దాడిని ఉద్దేశించి మరో మారు ఆసక్తికర ట్వీట్ చేశారు.

రైతులకు 24 గంటల విద్యుత్ విషయంలో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ను రేవంత్ రెడ్డి ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తుందని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కెసిఆర్ కరెంట్ అవినీతిని అంతమొందిస్తాం అని ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.
Recommended Video

ఈ ట్వీట్ ద్వారా కాంగ్రెస్ రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తుందని స్పష్టం చేశారు. ఇదే ట్వీట్లో బై బై కెసిఆర్ అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అయితే వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్తును ఇవ్వదు అని బిఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తున్న సమయంలో, రేవంత్ రెడ్డి 24గంటల కరెంటు తాము అధికారంలోకి వస్తే ఇస్తామని ట్వీట్ చేసి ప్రజలకు క్లారిటీ ఇచ్చారు.
బి ఆర్ ఎస్ తన వ్యాఖ్యలను వక్రీకరించి చేస్తున్న ప్రచారాన్ని, ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా చేస్తున్న వ్యూహాత్మక దాడిని రేవంత్ రెడ్డి తన ట్వీట్ ద్వారా దీటుగా ఎదుర్కొనే ప్రయత్నం చేశారు. మరి ఇకనైనా ఈ ఆందోళనలు సద్దు మణుగుతాయా లేదా అన్నది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications