రైతు బంధుతో బీఆర్ఎస్ రాజకీయం-ఇతర బంధులు ఇచ్చేవరకూ అడ్డుకోండి-రేవంత్ పిలుపు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఈసారి ఎలాగైనా కేసీఆర్ ను గద్దెదింపి అధికారం చేపట్టాలన్న లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ప్రచారంలోనూ దూకుడు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా కల్వకుర్తిలో జరిగిన బహిరంగ సభలో టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి ఇవాళ కేసీఆర్ టార్గెట్ గా తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ గెలిస్తే చర్లపల్లిలో కేసీఆర్ కు డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తామన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగిరినపుడే మన గౌరవం పెరుగుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. బీఆరెస్ నేతలు బరితెగించి మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇక్కడ కట్టిన సాగునీటి ప్రాజెక్టులు... రహదారుల అభివృద్ధి కాంగ్రెస్ హయాంలో జరిగిందేనన్నారు. కేసీఆర్ నీళ్లు ఇచ్చింది నిజమే అయితే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు పాడావు పడిందని రేవంత్ ప్రశ్నించారు.

కేసీఆర్ ను ఆనాడు ఎంపీగా గెలిపించినా ఈ ప్రాంతానికి చేసిందేం లేదని రేవంత్ తెలిపారు. కేసీఆర్ బక్కోడు కాదు లక్ష కోట్లు, 10వేల ఎకరాలు దోచుకున్న బకాసురుడన్నారు. ప్రజలను నమ్మించి మోసం చేసి కేసీఆర్ రెండుసార్లు సీఎం అయ్యారని, ఆయన కుటుంబ సభ్యులు మంత్రులు అయ్యారన్నారు. కేసీఆర్ కు చర్లపల్లిలో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. ఈ నెల కేసీఆర్ వేసే రైతు బంధు 10వేలేనని, వచ్చే నెల కాంగ్రెస్ వస్తే 15వేలు ఇస్తామన్నారు.
బీజేపీ, బీఆరెస్ కుట్ర చేసి రైతులకు నష్టం చేస్తున్నాయని రేవంత్ ఆరోపించారు. అయినా సరే...కాంగ్రెస్ రాగానే మిగిలిన డబ్బులు రైతులకు చెల్లిస్తుందన్నారు. రైతు బంధుకు లేని అడ్డు దళితబంధు,బీసీ బంధు మైనారిటీ బంధుకు ఎందుకని రేవంత్ ప్రశ్నించారు. ఇందుకు నిరసనగా రేపు అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వ దిష్టి బొమ్మలను దహనం చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. దళితబందు, బీసీ బంధు, మైనారిటీ బంధు ఇచ్చే వరకు బీఆర్ఎస్ నాయకులను గ్రామాలకు రానివ్వకండని పిలుపునిచ్చారు. ఢిల్లీలో మోదీ, గల్లీలో కేడీ ఇద్దరూ ఒక్కటేనని, బీజేపీకి ఓటు వేస్తే మూసీలో వేసినట్లేనన్నారు.












Click it and Unblock the Notifications