వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి: టిడిపి ఆఫీస్ వేదికగా చంద్రబాబుకు చిక్కులు
టిడిపి ఆఫీస్ వేదికగా రేవంత్ రెడ్డి సోనియా గాంధీని ప్రశంసించారు. సోనియా వల్లనే తెలంగాణ వచ్చిందని ఆయన కుండబద్దలు కొట్టారు.ఇది చంద్రబాబును ఇరకాటంలో పడేస్తుందా అనే సందేహం కలుగుతోంది.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు మాటల రూపంలో, తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి చేతల రూపంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇవ్వదలుచుకున్నట్లు అర్థమవుతోంది.
కెసిఆర్ శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశంలో చేసిన విమర్శలకు రేవంత్ రెడ్డి ఘాటుగా ప్రతిస్పందించారు. రేవంత్ రెడ్డి టిడిపి ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని ప్రశంసించారు.
అయితే, చంద్రబాబును కూడా ఆయన కొనియాడారు. కానీ చంద్రబాబు కన్నా ఎక్కువగా ఆయన సోనియా గాంధీని పొగిడేశారు. తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి టిడిపి కార్యాలయం వేదికగా సోనియా గాంధీని ప్రశంసించడం చంద్రబాబుకు చిక్కులు తెచ్చి పెట్టేదే అని విశ్లేషిస్తున్నారు.

కెసిఆర్ అనంతపురం పర్యటన తర్వాత....
కెసిఆర్ పరిటాల శ్రీరామ్ పెళ్లికి హాజరై, తెలుగుదేశం పార్టీ నాయకుడు పయ్యావుల కేశవ్‌తో రహస్య చర్చలు జరిపారని అంటున్నారు. చంద్రబాబును కలిసి ఆప్యాయంగా మాట్లాడారు. తెలంగాణలో టిడిపి కాంగ్రెసుతో పొత్తు పెట్టుకోదని మోత్కుపల్లి నర్సింహులు చెప్పారు. ఈ నేపథ్యంలో టిడిపికి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి మధ్య స్నేహం బలపడుతుందని భావిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెసు పార్టీని దెబ్బ తీయడానికి టిడిపి, తెరాస ఒక్కటి కావడానికి సిద్ధపడినట్లు చెబుతున్నారు. ఇది రేవంత్ రెడ్డికి మింగుడుపడని విషయం. టిడిపి తెలంగాణలో కెసిఆర్‌ను ఎదుర్కోవాలని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కావాలనే ఆశ కూడా ఆయనకు ఉంది.

సోనియాను ఇలా పొగడేశారు...
తమ పార్టీలోని పరిణామాలు రేవంత్ రెడ్డికి నచ్చకపోవడం వల్లనే సోనియాను పొగిడినట్లు చెబుతున్నారు. సోనియా గాంధీ దయతలిస్తేనే తెలంగాణ వచ్చిందని ఆయన అన్నారు. ఆమె కాళ్లు మొక్కి నమ్మద్రోహం చేశారని ఆయన కెసిఆర్‌పై ధ్వజమెత్తారు. ఇది టిడిపిలో చర్చనీయాంశంగా మారింది. తన భవిష్యత్తు రాజకీయాన్ని దృష్టిలో ఉంచుకునే ఆయన టిడిపి కార్యాలయాన్ని వేదికగా చేసుకుని సోనియాను పొగడడమే కాకుండా తెరాసతో కలిసి పనిచేస్తే తమ ఇంటి వాళ్లే తమను ఇంటికి రానీయరని తమ పార్టీ సీనియర్లను ఉద్దేశించి అన్నారు.

కెసిఆర్‌కు కౌంటర్...
కోదండరామ్ ఎప్పుడైనా తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతాచారి కుటుంబాన్ని పరామర్శించాడా అని కెసిఆర్ వేసిన ప్రశ్నకు ఆయన ధాటిగా జవాబు ఇచ్చాడు. కోదండరామ్‌ను ప్రశ్నించిన కెసిఆర్ రేపు నల్లగొండలో జరిగే ఉప ఎన్నికల్లో శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను పోటీకి దించాలని, ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా తాము కూడా కలిసి వస్తామని చెప్పారు. అన్ని పార్టీలను అందుకు తాను ఒప్పిస్తానని కూడా చెప్పారు.

చంద్రబాబు ఎలా ప్రతిస్పందిస్తారో...
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే కాంగ్రెసు వ్యతిరేకత వల్ల జరిగిందని అంటారు. దాంతో కాంగ్రెసు దూరంగా ఉండడమే విధానంగా ఆ పార్టీ పెట్టుకుంది. ఇప్పుడు ఏకంగా టిడిపి కార్యాలయం వేదికగా రేవంత్ రెడ్డి సోనియా గాంధీని ప్రశంసించడంపై చంద్రబాబు ఎలా ప్రతిస్పందిస్తారనే ప్రశ్న ఉదయిస్తోంది. దీనిపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications