సొంత జిల్లాలో రేవంత్ రెడ్డికి బిగ్ షాక్..!
పాలమూరు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సొంత ప్రాంతం నుంచే వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నుంచి ఓటమి పాలైన రేవంత్ రెడ్డికి, ఇప్పుడు గద్వాలలో కూడా భారీ షాక్ తగిలింది.
గద్వాలలో కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ
గద్వాల మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. గురువారం నాడు తన నిర్ణయాన్ని ప్రకటించిన ఆయన, త్వరలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 6 లేదా 10వ తేదీన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఆశ్చర్యకరంగా, కేశవ్‌తో పాటు పలువురు కాంగ్రెస్ కౌన్సిలర్లు, నాయకులు కూడా పార్టీని వీడనున్నారు.

పాలనలో రేవంత్ రెడ్డి వైఫల్యం..
ఈ సందర్భంగా బీఎస్ కేశవ్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని, పాలనలోనూ ఫెయిల్ అయ్యారని తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో తమకు, తమ కార్యకర్తలకు సరైన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు ఇక భవిష్యత్ లేదని, అందుకే పార్టీని వీడుతున్నట్లు స్పష్టం చేశారు.
ఏడాదిలోనే యూటర్న్..
గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో 18 మంది మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన బీఎస్ కేశవ్, ఏడాది తిరగకుండానే తిరిగి బీఆర్‌ఎస్‌లోకి వెళ్తుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది రేవంత్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుకు వ్యక్తిగతంగా, రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
నడిగడ్డలో ఆసక్తికర పరిణామాలు
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అనర్హత వేటులో పదవి కోల్పోయే ప్రమాదం ఉండటం, తిరిగి గద్వాలలో బీఆర్‌ఎస్ గెలిచే అవకాశం ఉండటంతో నడిగడ్డ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఈ పరిణామాలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చేదు ఫలితాలు కలిగించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి, పాలమూరులో రేవంత్ రెడ్డికి గడ్డు పరిస్థితులు తప్పేలా లేవని ప్రస్తుత పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications