ఆటో, క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్‌పై వరాలు కురిపించిన రేవంత్ రెడ్డి
Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. చిరు ఉద్యోగులపై వరాల జల్లు కురిపించింది. ఎన్నికల ప్రచార సమయంలో వారితో పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ సమావేశం అయినప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే దిశగా చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా- రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ బాయ్స్ కోసం ప్రత్యేకంగా అయిదు లక్షల రూపాయల వరకు చికిత్స అందజేసేలా ప్రత్యేకంగా ప్రమాద బీమా సౌకర్యాన్ని ప్రవేశ పెడతామని అన్నారు. అలాగే- రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తామని చెప్పారు.

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ సిబ్బంది, ఆటో డ్రైవర్ల సమస్యలను తెలుసుకోవడానికి నిర్వహించిన సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పాల్గొన్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలను రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు.
సామాజిక రక్షణ కల్పించడంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. అసంఘటిత కార్మికుల ఉపాధి, సామాజిక భద్రతకు చర్యలు తీసుకుంటామని, దీనికోసం రాజస్థాన్ ప్రభుత్వం రూపొందించిన చట్టాన్ని అధ్యయనం చేసి, వచ్చే బడ్జెట్ సమావేశాల్లో సభలో ప్రవేశపెడతామని హామీ చెప్పారు.
ప్రైవేటు సంస్థలు లాభాపేక్ష మాత్రమే కాకుండా.. కార్మికులు, ఉద్యోగుల సంక్షేమంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. గివ్ అండ్ టేక్ పాలసీని పాటించని ఎంత పెద్ద సంస్థలపైన అయినా చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని తేల్చి చెప్పారు. కొద్దిరోజుల కిందట స్విగ్గి డెలివరీ బాయ్ కుక్క తరిమితే భవనంపై నుంచి పడి మృతి చెందిన ఉదంతాన్ని రేవంత్ గుర్తు చేశారు.
ఆ ఉద్యోగి కుటుంబానికి గత ప్రభుత్వం ఏదైనా సాయం చేస్తుందని ఎదురు చూశానని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఎలాంటి సహాయం అందజేయలేదని అన్నారు. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు ప్రభుత్వాలు మానవత్వంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అందుకే ఆ కుటుంబం వివరాలు సేకరించి సీఎం సహాయనిధి నుంచి ఆ కుటుంబానికి రెండు లక్షల రూపాయలను అందించాలని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నానని రేవంత్ రెడ్డి అన్నారు.
ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు నిర్వహించే ప్రజాపాలన గ్రామసభలలో దరఖాస్తుల ద్వారా వివరాలు అందించాలని క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్ లు, ఆటో డ్రైవర్లకు సూచించారు. డిజిటల్, మాన్యువల్.. ఇలా ఏ రూపంలోనైనా దరఖాస్తులు ఇవ్వొచ్చని, ప్రతీ నాలుగు నెలలకోసారి గ్రామ సభలు నిర్వహిస్తామని, ప్రజా వాణిలో వచ్చిన దరఖాస్తులను అన్నింటినీ పరిష్కరిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications