ఓవైసీ బెదిరిస్తే రేవంత్ కు భయం పట్టుకుంది: బండి సంజయ్
కాంగ్రెస్ చేతగాని దద్దమ్మ ప్రభుత్వం అని, హైడ్రా కూల్చివేతల పేరుతో కాంగ్రెస్ డ్రామాలు ఆడుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. హైడ్రా కూల్చివేతల విషయంలో ఓవైసీకి ఒక న్యాయం? ఇతరులకు మరో న్యాయమా? అంటూ నిలదీశారు. సకలం చెరువును ఆక్రమించిన ఒవైసీ విద్యా సంస్థలకు ఎందుకు నోటీసులివ్వరు? అని బండి సంజయ్ ప్రశ్నించారు.
చేతులు ముడుచుకు కూర్చోవడానికి సిగ్గులేదా?
మా సంస్థలపై చెయ్యేస్తే అంతు చూస్తామని చేతులు ముడుచుకు కూర్చోవడానికి సిగ్గులేదా? అంటూ రేవంత్ సర్కార్ ను టార్గెట్ చేశారు. ఓవైసీ అరాచకాలను అణిచివేసి హిందువులకు భరోసా కల్పించేందుకే పాతబస్తీ నుండి ప్రజాసంగ్రామ యాత్ర స్టార్ట్ చేసి సత్తా చాటామని ఆయన గుర్తుచేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉంటే ఓవైసీకి చెందిన ఒక్కో బిల్డింగ్ కు ఒక్కో బుల్డోజర్ పెట్టేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ ఒక పెద్ద డ్రామా కంపెనీ : బండి సంజయ్
ఓవైసీ వార్నింగ్ కు కాంగ్రెస్ భయపడుతుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓ పెద్ద డ్రామా కంపెనీ అని టార్గెట్ చేసిన బండి సంజయ్ రుణమాఫీ సర్వే పేరుతో మళ్లీ కాంగ్రెస్ డ్రామాలు స్టార్ట్ చేసిందని నిప్పులు చెరిగారు. రుణమాఫీ ఎంతమందికి వర్తించింది. ఇంకా అర్హులెందరున్నారో బ్యాంకుల వద్ద అన్ని వివరాలుండగా మళ్లీ సర్వే ఎందుకు? అని ప్రశ్నించారు.
ప్రజల దృష్టి మళ్ళించేందుకు కాంగ్రెస్ జిమ్మిక్కులు
కాలయాపన చేసేందుకు కాంగ్రెస్ రకరకాల డ్రామాలు ఆడుతుందన్నారు. 6 గ్యారంటీలపై ప్రజల దృష్టి మళ్లించేందుకు బీఆర్ఎస్ ను మించి కాంగ్రెస్ జిమ్మిక్కులు చేస్తోందన్నారు.హైడ్రా దాడులు, విగ్రహాల లొల్లి, రుణమాఫీ సర్వే పేరుతో కాంగ్రెస్ డ్రామాలాడుతోందని విమర్శించారు. ఇక బీఆర్ఎస్ ను టార్గెట్ చేసిన బండి సంజయ్ ఎస్టీలపై బీఆర్ఎస్ చేసిన అరాచకాలు ఇంకా నా కళ్ల ముందు మెదులుతున్నాయన్నారు.
బీఆర్ఎస్ ను టార్గెట్ చేసిన బండి సంజయ్
వడ్ల కొనుగోలు కేంద్రాలకు వెళితే బీఆర్ఎస్ చేసిన దాడుల్లో రైతుల, కార్యకర్తల తలలు పగిలిన దారుణ సంఘటనను మర్చిపోదామా? ప్రజా సంగ్రామ యాత్రపై బీఆర్ఎస్ గూండాలు దాడి చేసి కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఘటనను మరువలేనని ఆయన గుర్తు చేశారు. బీఆర్ఎస్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.
బీఆర్ఎస్ బీజేపీలో విలీనం ప్రసక్తే లేదు
సిగ్గులేకుండా బీఆర్ఎస్ పార్టీ డ్రామాలాడుతోంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోంది. బీఆర్ఎస్ విలీనం ప్రసక్తే లేదు... ఆ పార్టీ అంతు చూస్తాం అని తేల్చి చెప్పారు. 2028లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామన్నారు.












Click it and Unblock the Notifications