ఢిల్లీకి రేవంత్- పొంగులేటి- జూపల్లి: ఏం చేయబోతోన్నారు..?!
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించింది తెలంగాణ. దీనికి సంబంధించిన వేడి రాజుకుంటోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి ఇక ఎంతో సమయం లేదు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికార భారత్ రాష్ట్ర సమితి.. హ్యాట్రిక్‌పై గురి పెట్టింది. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోంది.
అటు కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి వచ్చేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుంటోంది. బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయాన్ని నిలువరించడానికి సర్వశక్తులను ఒడ్డుతోంది. కర్ణాటక ఫార్ములాను అనుసరించేలా వ్యూహాలపై కసరత్తు సాగిస్తోంది. ఈ క్రమంలో చేరికలకూ అధిక ప్రాధాన్యత ఇస్తోంది.

ఇందులో భాగంగా- ఖమ్మం, జోగులాంబ గద్వాల జిల్లాలకు చెందిన సీనియర్ నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావును పార్టీలో చేర్చుకోవడానికి అవసరమైన చర్యలన్నింటినీ పూర్తి చేసింది కాంగ్రెస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు పొంగులేటి. ఆ తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్‌లో జాయిన్ అయ్యారు గానీ అక్కడ ఎక్కువ కాలం పాటు కొనసాగలేకపోయారు.

జూపల్లి కృష్ణారావు పరిస్థితీ అంతే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. అనంతరం బీఆర్ఎస్‌లో చేరినప్పటికీ.. ఆ పార్టీకి దూరం అయ్యారు. ఇప్పుడిక మళ్లీ సొంతగూటికి చేరబోతోన్నారు జూపల్లి. పొంగులేటితో కలిసి కాంగ్రెస్ కండువాను కప్పుకోవడానికి సమాయాత్తమౌతోన్నారు. దీనికోసం వారిద్దరూ ఇవ్వాళ తమ అనుచరులతో సమావేశం అయ్యారు.

వారిద్దరూ సోమవారం హస్తినకు బయలుదేరి వెళ్లనున్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా వారితో పాటు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ ముగ్గురు నేతలూ మధ్యాహ్నం 12:30 నిమిషాలకు రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు. ఇది కీలక భేటీ. పొంగులేటి, జూపల్లి చేరిక విషయంలో ఇది తుది అంకం కాబోతోంది. రాహుల్ వద్ద తమ డిమాండ్లను ఉంచడం, వాటిపై స్పష్టమైన హామీని పొందిన తరువాతే కాంగ్రెస్ కండువాను కప్పుకొంటారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications