సినిమా టికెట్ల రేట్ల పెంపుపై కండిషన్లు పెట్టిన రేవంత్: నిర్మాతలకు తేల్చి చెప్పిన సీఎం
Revanth Reddy: తెలంగాణలో రోజురోజుకూ వివాదాస్పదంగా మారుతున్న గంజాయి అమ్మకాలపై ఉక్కుపాదం మోపింది ప్రభుత్వం. రాజకీయంగా దుమారం చెలరేగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో తక్షణ చర్యలకు దిగింది. మాదక ద్రవ్యాలు, గంజాయి వినియోగం, అక్రమ రవాణాపై నిఘా పెట్టింది.
ఇందులో భాగంగా- గంజాయి సాగు, అక్రమ రవాణా గురించి సమాచారం ఇచ్చిన వారికి క్యాష్ రివార్డును ప్రకటించింది. దీనిపై ప్రత్యేకంగా క్యాంపెయిన్‌ను ప్రారంభించబోతోంది. మాదక ద్రవ్యాలు, గంజాయికి వ్యతిరేకంగా ప్రభుత్వం. దీన్ని అరికట్టడానికి ప్రజల భాగస్వామ్యాన్ని తీసుకుంటోంది. దీనితో పాటు- టాలీవుడ్ సహకారాన్ని కూడా తీసుకునే ప్రయత్నాలు చేపట్టింది.

ఇందులో భాగంగా కొన్ని కండిషన్లను పెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సినిమా టికెట్ల రేట్లను పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వాలంటూ తమకు దరఖాస్తు చేసే ప్రతి చిత్ర నిర్మాణ సంస్థ కూడా మాదక ద్రవ్యాల వినియోగం, సైబర్ క్రైమ్ వల్ల కలిగే నష్టాలను వివరించేలా వీడియోను తమకు అందజేయాల్సి ఉంటుందని అన్నారు.
సైబర్ సెక్యూరిటీ బ్యూరో, యాంటీ నార్కొటిక్స్ బ్యూరోకు చెందిన కొత్త వాహనాలను రేవంత్ రెడ్డి కొద్దిసేపటి కిందటే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో మాట్లాడారు. సైబర్ క్రైమ్, డ్రగ్స్ నియంత్రణపై ఒక వీడియోను తప్పనిసరిగా చిత్రీకరించి విడుదల చేయాలని సూచించారు. కొత్తగా విడుదలయ్యే సినిమాలో నటించిన నటీనటులతో ఈ వీడియో తీయాలని కండిషన్ పెట్టారు.
ఈ విషయంలో రాజీ పడొద్దని, ఎంత పెద్ద వాళ్లు, ఎవరు వచ్చి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవద్దని రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. టికెట్ల రేట్లను పెంచదలిచిన సినిమాలో నటించిన స్టార్లు ఖచ్చితంగా సైబర్ క్రైమ్, డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా రెండు నిమిషాల నిడివి ఉన్న వీడియోను తమకు అందజేయాల్సిందేనని చెప్పారు.
Watch Live: Hon'ble CM Sri @Revanth_Anumula flagging off new vehicles for @TG_ANB & @TGCyberBureau at Command & Control Centre, Hyderabad. #CyberSecurity #DrugfreeTelangana https://t.co/Q5WTaLKVCc
— Telangana CMO (@TelanganaCMO) July 2, 2024
టాలీవుడ్ పెద్దలు సమాజం నుంచి ఎంతో తీసుకుంటోన్నారని, కొంతైనా వెనక్కి ఇవ్వాల్సిన బాధ్యత వారిపై ఉందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. వందల కోట్ల పెట్టుబడిన పెట్టిన సినిమాలకు టికెట్ల రేట్లు పెంచుకుని ఇంకా సంపాదించుకుంటాననుకోవడం మంచిదేనని, సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని అన్నారు.
సైబర్ క్రైమ్, డ్రగ్స్, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగం వల్ల ఈ సమాజం నిర్వీర్యమైపోతోందని, కాపాడాల్సిన బాధ్యత సినీ పరిశ్రమ మీద ఉందని స్ఫష్టం చేశారు రేవంత్ రెడ్డి. థియేటర్‌లో సినిమా ప్రారంభం కావడానికి ముందు ఈ వీడియోలను తప్పనిసరిగా ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సమాచార మంత్రిత్వ శాఖకు ఆదేశించారు.
గతంలో తాను సినిమాలు చూసేటప్పుడు థియేటర్‌లో ప్రధానమంత్రుల కార్యక్రమాలు, వారి విదేశీ పర్యటనలకు సంబంధించిన రీళ్లను ప్రదర్శించే వాళ్లని ఇప్పుడా పరిస్థితి లేదని రేవంత్ రెడ్డి అన్నారు. సినిమా పరిశ్రమ పెద్దలు, థియేటర్ల యజమానులు సామాజిక బాధ్యతను మరిచిపోయారని చెప్పారు.
మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే యాంటీ డ్రగ్స్‌పై ఓ వీడియోను విడుదల చేసిన విషయాన్ని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆయనను కృతజ్ఞతలు తెలిపారు. చిరంజీవి తనవంతుగా ముందుకు వచ్చి ఈ వీడియోను తీశారని, ప్రతి ఒక్క స్టార్ కూడా ఇలాంటి ఆలోచనతో ఉండాలని అన్నారు.












Click it and Unblock the Notifications