ధనిక రాష్ట్రం ధాన్యం కొనుగోలు చేయదా?: కేసీఆర్ ధర్నాలో ఎందుకు పాల్గొనలేదంటూ రేవంత్ ఫైర్
హైదరాబాద్: వరి ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఎంట్రీ ఇచ్చింది. టీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. తాజాగా, రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శల దాడి పెంచారు.

ధర్నాలో కేసీఆర్ ఎందుకు పాల్గొనడం లేదంటూ రేవంత్
ఆదివారం గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్, బీజేపీ బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా చైతన్య యాత్రను రద్దు చేయలేదని, వాయిదా వేశామని తెలిపారు. రాష్ట్రంలో జిల్లా కలెక్టర్లు రాజకీయ నేతల అవతారం ఎత్తారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ధర్నాలకు అనుమతిస్తున్నారని, తమకు ఎందుకు ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నిబంధనలు కాంగ్రెస్ పార్టీకేనా.. టీఆర్ఎస్, బీజేపీలకు వర్తించవా? అని కేసీఆర్ సర్కారును నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ చేపట్టిన ధర్నాలో సీఎం కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.

ధనిక రాష్ట్రం ధాన్యం కొనుగోలు చేయలేదా? అంటూ రేవంత్
ధనిక రాష్ట్రం ధాన్యం కొనుగోలు చేయలేదా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు చేయని పార్టీలకు ఓటెందుకు వేయాలని నిలదీశారు. ప్రత్యేక బడ్జెట్ ధాన్యం కొనుగోలు చేయాలని రేవంత్ రెడ్డి చేశారు. మరోవైపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై పేరు ప్రస్తావించకుండా విమర్శలు గుప్పించారు. 1947 స్వాతంత్ర్య పోరాటాన్ని అవమాన పర్చడం దారుణమని, అలాంటి వ్యాఖ్యలు చేసేవారు దేశద్రోహులని మండిపడ్డారు.
Recommended Video

బీజేపీని గద్దె దించాలంటూ భట్టి విక్రమార్క
ఈ దేశం ఇంత బలంగా నిర్మాణం అవడానికి జవహర్ లాల్ నెహ్రూ వేసిన పునాదులే కారణమని, దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ నివాళులర్పించాలని భట్టి విక్రమార్క అన్నారు. కొందరు స్వార్థ రాజకీయ నాయకులు తమ వ్యక్తిగత స్వార్థం కోసం దేశ స్వాతంత్ర్యంలో ఎలాంటి సంబంధం లేనివారిని ఉద్యమకారులుగా చెబుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డగోలుగా అమ్మేస్తోందని ఆరోపించారు. ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన అవసరముందన్నారు. హుజూరాబాద్ ఎన్నికపై ఢిల్లీలో అర్థవంతమైన సమీక్ష జరిగిందన్నారు. ఈ విషయంలో వచ్చిన ఏ వార్త కూడా నిజం కాదన్నారు. ఈ సమీక్షపై మీడియాకు తాము చెప్పిందే వాస్తవమని తెలిపారు.












Click it and Unblock the Notifications