ఆత్మహత్యలతో తెలంగాణా శవాలదిబ్బగా.. ఇది కేసీఆర్ రాక్షసపాలన; 317జీవోపై పార్లమెంట్లో: రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించిన రేవంత్ రెడ్డి మహబూబాబాద్‌లో గుండెపోటుతో చనిపోయిన టీచర్ జేతి రామ్ నాయక్ కుటుంబసభ్యులను రేవంత్ రెడ్డి పరామర్శించారు . అనంతరం బయ్యారంలో ఉద్యోగ నోటిఫికేషన్లు రాక ఆత్మహత్య చేసుకున్న ముత్యాల సాగర్ కుటుంబ సభ్యులను రేవంత్ రెడ్డి పరామర్శించారు . రేవంత్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Recommended Video

ప్రభుత్వ ఉపాధ్యాయుల మరణానికి కారణం ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 317
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం సంధ్య తండాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు జేతి రామ్ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించిన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ ను, కేసీఆర్ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందని మండిపడ్డారు. జేతి రామ్ నాయక్ మరణానికి కారణం ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జేతి రామ్ నాయక్ అంత్యక్రియలు కూడా పోలీసు పహారా మధ్య కుటుంబసభ్యుల కడసారి చూపుకు కూడా నోచుకోకుండా జరిగిందని రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో మానవత్వం లేని రాక్షస పాలన
ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే ప్రభుత్వం తరఫున కనీసం పరామర్శ కూడా లేదని, రాష్ట్రంలో మానవత్వం లేని రాక్షస పాలన సాగుతోందని రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. 317 జీవో కారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు స్థానికతను కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని మండిపడ్డారు. 317 జీవోను రద్దు చేసే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉన్న రాజకీయ లబ్ది కోసం ఆరాట పడుతుంది అని విమర్శించారు. రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు జీవో వల్ల ప్రాణాలు కోల్పోతున్నా సీఎం కేసీఆర్ కు పట్టింపు లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ జేతి రామ్ నాయక్ కుటుంబానికి అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు.

ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇవ్వకపోవడం వల్లే విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నారు
బయ్యారం లో ఉద్యోగ నోటిఫికేషన్లు ఆత్మహత్యకు పాల్పడిన ముత్యాల సాగర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇవ్వకపోవడం వల్లే విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నారు అని, అయినా సరే కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పించారు. విద్యార్థులను బాధ పెడుతున్న పాపం ఊరికే పోదు అని కేసీఆర్ పై మండిపడ్డారు. సాగర్ కుటుంబానికి 50 లక్షల రూపాయలు, మూడు ఎకరాల భూమి, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఆత్మహత్యలతో తెలంగాణ రాష్ట్రం శవాల దిబ్బగా
కెసిఆర్ అబద్ధాల వల్ల రైతులు, విద్యార్థులు నిరాశతో ఆత్మహత్యలు చేసుకుని తెలంగాణ రాష్ట్రం శవాల దిబ్బగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సాగర్ కుటుంబానికి గతంలో ఇందిరమ్మ ఇళ్లు కాంగ్రెస్ ఇవ్వడం వల్ల, ఆ ఇల్లే ఈ కుటుంబానికి ప్రస్తుతం దిక్కు అయిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మానవత్వాన్ని కోల్పోయిన కేసీఆర్ ప్రభుత్వాన్ని శిక్షించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఒక లక్ష 91 వేల ఉద్యోగ నోటిఫికేషన్ లను వెంటనే విడుదల చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అంతేకాదు ప్రశాంత్ కిషోర్ అనే రాజకీయ వ్యూహకర్తను కేసీఆర్ నమ్ముతున్నారని, వందమంది వ్యూహకర్తలు వచ్చినా రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఆపలేరని రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.

317జీవోపై పార్లమెంట్ లో పోరాటం చేస్తాం
317 జీవో అంశాన్ని రాష్ట్రంలో శాసన సభలోనూ, కేంద్రంలో పార్లమెంట్ లోనూ తమ పార్టీ ప్రయత్నిస్తోందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రపతి ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ వ్యవహరిస్తున్నాయని రేవంత్ రెడ్డి మండిపడ్డారు జీవో 317 ను వెంటనే రద్దు చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే దీనిపై పార్లమెంట్లో పోరాటం చేస్తామని తేల్చిచెప్పారు. అనంతరం పర్వతగిరిలో రేవంత్ రెడ్డి పర్యటించారు. ఇటీవల పంట నష్టం, అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన మిరప రైతు సంపత్ కుటుంటాన్ని రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆయన కుటుంబానికి రూ. 25 వేలు ఆర్థిక సాయం చేశారు. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.












Click it and Unblock the Notifications