కేసీఆర్ ను టెన్షన్ పెట్టేలా రేవంత్ వ్యూహం.. మిషన్ భగీరథపై విజిలెన్స్ విచారణ!!
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత గతంలో బీఆర్ఎస్ పాలనపై, కేసీఆర్ హయాంలో కొనసాగిన అవినీతిపై ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే గత తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించామని చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మంత్రుల కమిటీ నేరుగా అక్కడికి వెళ్లి కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించి దర్యాప్తు జరిపిస్తామని చెప్పిన విషయం తెలిసిందే.
ఇక తాజాగా మిషన్ భగీరథ పనులలో కూడా భారీగా అవినీతి జరిగిందని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం దీనిపైన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తుకు ఆదేశించాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. మాజీ సీఎం కేసీఆర్ కు ఊపిరాడనివ్వకుండా అనేక అంశాలపైన ఫోకస్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి రక్షిత మంచినీటిని అందించే లక్ష్యంతో గతంలోని బిఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని నిర్వహించింది.

అయితే మిషన్ భగీరథ పథకాన్ని 40 వేల కోట్లతో అమలు చేసిన గత సర్కార్ భారీగా అవకతవకలకు పాల్పడినట్టు ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే మిషన్ భగీరథ పథకంపై దర్యాప్తు సంస్థ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే చర్చించినట్టు తెలుస్తుంది.
పనులు చేయకుండానే బిల్లులు తీసుకోవడం, చేసిన పనులనే మళ్లీ చేస్తున్నట్టుగా చూపించడం, సామాగ్రి కొనకుండానే కొన్నట్టు చూపించడం కొనుగోలు చేసిన పరికరాలను వినియోగించకుండా పక్కన పడేయడం వంటివి మిషన్ భగీరథలో జరిగాయని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో విజిలెన్స్ విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది.
ప్రస్తుతం మిషన్ భగీరథ పథకంపై వచ్చిన ఆరోపణల నిగ్గు తేల్చే క్రమంలో మండలానికి ఒక గ్రామంలో క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించినట్టు, ఈ మేరకు మంత్రి కూడా విజిలెన్స్ అధికారులతో ప్రాథమికంగా చర్చించినట్లు తెలుస్తుంది. అసలు మిషన్ భగీరథ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని సమూహాలకు అందించారు అన్న విషయం పైన కూడా నిజానిజాలు తెలుసుకోవడానికి కమిటీ వేయాలని ఇటీవల జరిగిన మంత్రిమండలి సమావేశంలో చర్చ జరిగింది.
వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడానికి కమిటీ వేయడమే సరైన నిర్ణయం అని మంత్రి మండలి లో మెజారిటీ సభ్యులు చెప్పారు . ఈ క్రమంలో మిషన్ భగీరథ పనుల పైన ప్రత్యేకమైనదృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం ఇక ఈ నేపథ్యంలోనే త్వరలోనే విజిలెన్స్ దర్యాప్తును ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం.












Click it and Unblock the Notifications