సీఎంగా రేవంత్ తొలి సంతకం : విధేయులకు కీలక పదవులు..!!
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అక్కడే అదే వేదిక నుంచి తొలి ఫైల్ పైన సంతకం చేయనున్నారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాల అమలు ఫైల్ పైన తొలి సంతకం చేయాలని రేవంత్ నిర్ణయించారు. అదే విధంగా రాజకీయంగా తొలి నియామకం కూడా దాదాపు ఖరారైంది. మంత్రివర్గం పైనా కసరత్తు చేసిన రేవంత్ హైకమాండ్ ఆమోదం తీసుకుంటున్నారు. అదే సమయంలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ పదవులను భర్తీ చేయనున్నారు.
తొలి సంతకం
సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న రేవంత్‌రెడ్డి తొలి ఫైల్ పైన సంతకం చేయనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమలు చేస్తామని చెప్పిన ఆరు గ్యారంటీ పథకాల అమలు పైన సంతకం చేయాలని నిర్ణయించారు. పార్టీ అగ్రనేతలు..అతిధులు..కొత్త మంత్రులు..పార్టీ శ్రేణుల సమక్షంలోనే సంతకం చేయాలని డిసైడ్ అయ్యారు.

2004లో వైఎస్సార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఉచిత విద్యుత్ ఫైల్ పైన ప్రమాణ స్వీకార వేదిక పైనే సంతకం చేసారు. ఇప్పుడు రేవంత్ అదే తరహాలో సంతకానికి సిద్దమయ్యారు. ఆ తరువాత 9న మంత్రివర్గ సమావేశంలో ఈ పథకాల అమలు తీరు తెన్నులను ఖరారు చేయనున్నారు. తెలంగాణలో ప్రస్తుత ఆర్దిక పరిస్థితులు రేవంత్ కు సవాల్ గా మారుతున్నాయి.
గ్యారంటీల పైనే ఫోకస్
ఈ గ్యారంటీల అమలుకు ఏడాదికి లక్ష కోట్ల వరకు ఖర్చు అవుతుంది. దీంతో, ఇప్పుడు నిధుల సమీకరణ రేవంత్ కు ఛాలెంజ్ కానుంది. ఇక..పాలనా పరంగానూ అనేక సవాళ్లు ముందున్నాయి. ఇదే సమయంలో సీఎం అయిన తరువాత రేవంత్ రాజకీయ నియామకాలపైన ఫోకస్ చేయనున్నారు.బాధ్యతలు చేపట్టగానే పంపకానికి నాలుగు ఎమ్మెల్సీ పదవులు సిద్ధంగా ఉన్నాయి. అందులో రెండు గవర్నర్ కోటా కాగా.. మరో రెండు ఎమ్మెల్యే కోటా.
గవర్నర్ కోటా కింద బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కె.సత్యనారాయణ పేర్లను కేసీఆర్ ప్రభుత్వం పంపించగా.. గవర్నర్ తమిళిసై అభ్యంతరాలతో ఆ పదవుల భర్తీ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అలాగే ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన కడియం శ్రీహరి, కౌశిక్ రెడ్డి ఈ ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్, హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఈ రెండు సీట్లనూ భర్తీ చేయాల్సి ఉంది. ఈ నాలుగు ఎమ్మెల్సీ పదవులను కొత్త ప్రభుత్వం ఎవరికి ఇవ్వనుందనే విషయం ఆసక్తికరంగా మారింది.

ఎమ్మెల్సీల నియామకం
కాంగ్రెస్ నుంచి ఈసారి ముస్లింలలో ఒక్కరు కూడా గెలవని నేపథ్యంలో.. రేవంత్‌రెడ్డికి సన్నిహితుడైన మాజీ మంత్రి షబ్బీర్ అలీని ఎమ్మెల్సీగా చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. షబ్బీర్ అలీకి మంత్రి పదవి కూడా ఖాయంగా కనిపిస్తోంది. అలాగే రేవంత్‌కు సన్నిహితుడైన మరో నేత అద్దంకి దయాకర్ కూడా ఎమ్మెల్సీ సీటును ఆశిస్తున్నారు.
వీరితో పాటు రేవంత్ టీపీసీసీ అధ్యక్షుడు కాక ముందు నుంచీ ఆయన వెన్నంటి ఉన్న హర్కార వేణుగోపాల్ పేరూ ఎమ్మెల్సీ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. సీపీఐకి రెండు ఎమ్మెల్సీ పోస్టులు ఇస్తామనీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఉంది. దీంతో.. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత రేవంత్ తీసుకొనే నిర్ణయాలపైన ఆసక్తి కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications