దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం: సీఎం రేవంత్ రెడ్డి
డీ లిమిటేషన్ ,50 శాతం పార్లమెంట్ స్థానాల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఎంపీ స్థానాల్లో ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాల మధ్య అంతరం ఎంత ఉందో అంతే స్థాయిలో సీట్ల పెంపు జరగాలని అన్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో కేంద్రం అన్యాయం, వివక్ష చూపుతోందని మండి పడ్డారు. దక్షిణాది రాష్ట్రాలు డీ లిమిటేషన్ పై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
"50 శాతం సీట్ల పెంపు ఏ లెక్కల ప్రకారం జరుగుతుంది. 50 శాతం సీట్ల పెంపు అనేది ఫైనల్ బుల్లెట్. ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్ల పెంపుతో దక్షిణాది రాష్ట్రాల అవసరం లేకుండా కేంద్రం లో ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. 50 శాతం సీట్ల పెంపు వల్ల కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో మా అవసరం లేకుండా పోతుంది. కేంద్ర ప్రభుత్వంలో జాతీయ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాల నేతలకు చోటు లేకుండా పోతుంది. జనాభా ఆధారంగా సీట్ల పెంపు జరిగినా దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది" అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
"అన్ని పక్షాలతో చర్చ జరిపి సీట్ల పెంపు పై ముందుకు వెళ్లాలి. నియోజకవర్గాల పెంపు దక్షిణాది రాష్ట్రాలకు వ్యతిరేకం. ఉత్తర భారతానికి దక్షిణ భారతానికి మధ్య అంతరాన్ని ఎన్డీఏ ప్రభుత్వం పెంచుతుంది. దక్షిణాది రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా" అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 50శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తున్న క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మరోవైపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోని ప్రస్తుత అసెంబ్లీ స్థానాల సంఖ్య కంటే 50 శాతం పెంచాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ స్థానాలతోపాటు పార్లమెంట్ స్థానాలను కూడా పెంచాలనే యోచనలో కేంద్రం ఉందని సమాచారం అందుతోంది. ఈ మేరకు ఇటీవల జరిగిన ఎన్డీయే సమావేశంలో భాగస్వామ్య పక్షాలకు కేంద్రం సూచనప్రాయంగా తెలియజేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, న్యాయశాఖమంత్రి అర్జున్రామ్ మేఘవాల్ల నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది.












Click it and Unblock the Notifications