పెళ్లి నుంచి తిరిగొస్తూ, తిరిగిరాని లోకాలకు.. 4 మృతి, 20 మందికి తీవ్రగాయాలు
వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈరోజు తెల్లవారుజామున పరిగి మండలం రంగాపూర్ సమీపంలో బీజాపూర్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా, 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. దీంతో తీవ్ర విషాదం నెలకొంది.
పోలీసుల సమాచారం మేరకు... రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చెన్వెళ్లి గ్రామానికి చెందిన పలువురు ప్రత్యేక బస్సులో పరిగిలో జరిగిన విందు కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమం ముగిశాక తిరిగి స్వగ్రామానికి బయలుదేరిన సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. రోడ్డుపై నిలిపి వుంచిన లారీని బస్సు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొ ముగ్గురు పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలోగా ప్రాణాలు కోల్పోయారు.

గాయపడిన వారిని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగతా బాధితులకు పరిగిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక వైద్యం అందిస్తున్నారు. ప్రమాదానికి ప్రధాన కారణం లారీ నిర్లక్ష్యంగా నిలిపివేయడమేనని పోలీసులు భావిస్తున్నారు. లారీని ఎలాంటి హెచ్చరికా బోర్డులు లేకుండా రహదారిపై ఆపడం.. అలాగే బస్సు వేగంగా ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు.
పరిస్థితిని తెలుసుకునేందుకు గ్రామస్తులు ఆసుపత్రుల వద్దకి భారీగా తరలివచ్చారు. మృతుల కుటుంబ సభ్యుల రోదనలు, గాయపడిన వారి పరిస్థితి చూసి అక్కడ విషాద వాతావరణం నెలకొంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి లారీ డ్రైవర్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications