ఐదు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు రూ. 1760 కోట్ల సొత్తు సీజ్: తెలంగాణలోనే అత్యధికం
హైదరాబాద్: దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఎన్నికల సంఘం అధికారులు, పోలీసులు జరిపిన తనిఖీల్లో భారీ మొత్తంలో సొమ్మ లభ్యమైంది. మొత్తం ఐదు రాష్ట్రాల్లో కలిపి ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఉద్దేశించిన రూ. 1760 కోట్ల విలువైన డ్రగ్స్, నగదు, బంగారం, వెండిని స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు సోమవారం తెలిపారు. ఈ ఐదు రాష్ట్రాల్లో తెలంగాణలోనే అత్యధికంగా సొత్తు పట్టుబడటం గమనార్హం.
2018లో ఈ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వాధీనం చేసుకున్న సొత్తు కంటే.. ఏడు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. గతలంలో స్వాధీనం చేసుకున్న మొత్తం కేవలం రూ. 239.15 కోట్లే కావడం గమనార్హం. కాగా, ఈసారి తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా 225.25 కోట్ల నగదును సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

తెలంగాణలో రూ.225.25 కోట్ల నగదు సహా మొత్తం రూ.659 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికలు ముగిసేనాటికి ఈ గణాంకాలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. మిజోరంలో నగదు లేదా బంగారం, వెండి వంటి విలువైన వస్తువులను స్వాధీనం చేసుకోలేదని ఎన్నికల సంఘం తెలిపింది. రూ.29.82 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్నట్లు వెల్లడించింది.
రాజస్థాన్ రాష్ట్రంలో 93.17 కోట్లు, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 33.72 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ పేర్కొంది. కాగా, ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో చీఫ్ సెక్రటరీలు, డీజీపీలు, ఎక్సైజ్ కమిషనర్లు, ఇన్కమ్ టాక్స్ అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతోంది ఈసీ. 228 మంది కేంద్ర ప్రభుత్వ ఉన్నత అధికారులను ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు అబ్జర్వర్లుగా నియమించింది.
కాగా, మధ్యప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్‌గఢ్‌లలో ఎన్నికలు పూర్తి కాగా, రాజస్థాన్, తెలంగాణలలో నవంబర్ 25, నవంబర్ 30న జరగనున్నాయి. డిసెంబర్ నెల 3వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ క్రమంలో ప్రధాన పార్టీలు విస్తృతంగా ఎన్నికలు ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తుండటంతో పెద్ద మొత్తంలో నగదు, మద్యం లభ్యమవుతోంది.












Click it and Unblock the Notifications