మీది ఘోరమైన చరిత్ర: కొండా సురేఖపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలనం
తనపై మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలు, విమర్శలకు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. తన గురించి మాట్లాడే అర్హత మీకు లేదంటూ సురేఖపై మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గురుకుల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. గురుకుల బాట అనే కార్యక్రమం చేపట్టారని ప్రవీణ్ కుమార్ తెలిపారు.
గురుకుల బాట అని చెప్పగానే కాంగ్రెస్‌కు భయం పుట్టిందన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుట్ర చేసి విష ఆహారం తినిపిస్తున్నారంటూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. మీరు ఒక మాతృమూర్తి.. మీకు ఒక ఆడ పిల్ల ఉంది.. అలాంటి మాటలు మాట్లాడవచ్చా? అని ప్రశ్నించారు. తన సొంత పిల్లలను వదిలేసి, వేలాది మంది విద్యార్థులను తన పిల్లలనుకుని సేవ చేశానని చెప్పుకొచ్చారు.

వరంగల్‌లో కొండా సురేఖ ఎన్నో అఘాయిత్యాలు చేశారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. అప్పట్లో మిమ్మల్ని నడిరోడ్డు మీద ఉంచి కౌన్సెలింగ్ ఇచ్చిన విషయం మర్చిపోయారా? అని ప్రశ్నించారు. ఇప్పుడు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు అప్పుడు సీఐగా ఉన్నారని.. ఆయనను అడగండి చెబుతాడని అన్నారు. రేవ్ పార్టీల గురించి, బిర్యానీల గురించి రీల్స్ చేసే మీరు.. అన్నం లేని గురుకుల పాఠశాల గురించి ఆలోచించారా? అని కొండా సురేఖను ప్రవీణ్ కుమార్ నిలదీశారు.
కొండా సురేఖ మత్తులో ఉండి మాట్లాడుతున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.ఘోరమైన చరిత్ర ఉన్న కొండా సురేఖ.. తమ గురించి మాట్లాడితే సహించమంటూ ఆర్ఎస్ ప్రవీణ్ హెచ్చరించారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకే గురుకుల బాట పట్టామన్నారు. మీకు చేతకాకపోతే విద్యాశాఖను బీఆర్ఎస్‌కు అప్పగించాలన్నారు. కొండా సురేఖ స్థాయికి తాను దిగజార దలుచుకోలేదని అన్నారు. మీరు భవిష్యత్ లో తెలంగాణలో మాట్లాడవద్దని కొండా సురేఖకు సూచించారు. మీరు మాట్లాడిన మాటలు వినలేక తెలంగాణలో మహిళలు తలదించుకుంటున్నారని అన్నారు.
మహిళలపై కొండా సురేఖ చేసిన ఆరోపణలకు ఆమెపై కేసు పెట్టాలని కోర్టు చెప్పిందన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆమెకు మంత్రిపదవిలో ఉండే అర్హత లేదన్నారు. గతంలో ఐపీఎస్ అధికారిగా ఉన్న తనకు కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చిందన్నారు. ఏడేళ్ల సర్వీసెస్ వదిలేసి విద్యార్థుల కోసం రాజకీయాల్లోకి వచ్చానని.. తనపై ఆరోపణలుంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఆరోపణలకు ఆధారాలుంటే సీబీఐ విచారణకు ఇవ్వండి అని కొండా సురేఖను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications