Sai Dharam Tej: ఆ బైక్ సెకండ్ హ్యాండ్-ప్రమాద సమయంలో స్పీడ్ ఎంతంటే-వెల్లడైన కీలక వివరాలు
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాద సమయంలో ఎంత స్పీడ్‌తో వెళ్లారనే దానిపై మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు స్పష్టతనిచ్చారు. రోడ్డు ప్రమాద సమయంలో సాయి ధరమ్ తేజ్ బైక్ 78కి.మీ స్పీడ్‌లో ఉందన్నారు. కేబుల్ బ్రిడ్జిపై 102కి.మీ స్పీడ్‌తో సాయి ధరమ్ తేజ్ బైక్ డ్రైవ్ చేశాడన్నారు.ప్రమాదానికి గురైన మార్గంలో కేవలం 30కి.మీ వేగంతో వెళ్లాలనే నిబంధన ఉందన్నారు. అతివేగం,నిర్లక్ష్యం వల్లే ప్రమాదం చోటు చేసుకుందన్నారు.
ఆటోను లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్ టేక్ చేయబోయి స్కిడ్ అయి కింద పడిపోయాడని డీసీపీ చెప్పారు. సాయి ధరమ్ తేజ్ వద్ద టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ లభ్యం కాలేదన్నారు.సాయి ధరమ్ తేజ్‌కు టూ వీలర్ లైసెన్స్ ఉందా లేదా అనే వివరాలు ఆరా తీస్తున్నామని తెలిపారు. సాయి తేజ్ నడిపిన స్పోర్ట్స్ బైక్ సెకండ్ హ్యాండ్ అని... దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. ఎల్బీనగర్‌కి చెందిన అనిల్ కుమార్ అనే వ్యక్తి నుంచి తేజ్ దాన్ని కొనుగోలు చేశాడన్నారు.విచారణ నిమిత్తం అనిల్‌ను కూడా పిలిపించి వివరాలు సేకరిస్తున్నామన్నారు. గతంలో ఇదే బైక్‌పై ఓవర్ స్పీడ్ చలానా నమోదైందని.. తాజాగా తేజ్ కుటుంబ సభ్యులు దాన్ని క్లియర్ చేశారని తెలిపారు.
మాదాపూర్ పరిధిలో ఈ ఏడాది ఇప్పటివరకూ 17,917 బైక్స్‌కి ఓవర్ స్పీడ్ కారణంగా జరిమానా విధించామన్నారు.మరో 5495 మంది మద్యం తాగి బైక్ డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డారని తెలిపారు.

ఆ బైక్ ఖరీదు ఎంతంటే.. :
సాయి ధరమ్ తేజ్ ట్రంఫ్ బైక్ నెంబర్ TS07 GJ1258. సూపర్ బైక్‌గా పిలిచే దీని ఖరీదు దాదాపు రూ.18లక్షలు. అనిల్ కుమార్ పేరుతో ఆ బైక్ రిజిస్ట్రేషన్ అయింది. ఇది హై ఎండ్ బైక్ అని చెబుతారు. దీని బరువు 228 కేజీల వరకు ఉంటుంది.బైక్ రైడింగ్ అంటే తేజ్‌కి చాలా ఇష్టం. షూటింగ్ లేని సమయంలో తన బైక్ లేదా స్నేహితుల బైక్ తీసుకుని సరదాగా రైడింగ్‌కు వెళ్తుంటాడు. శుక్రవారం కూడా అలాగే బయటకు వెళ్లగా ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదం సమయంలో అతను హెల్మెట్ ధరించడం వలన పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాద ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యం, రాష్ డ్రైవింగ్ కింద ఐపీసీ 336, 184 ఎంవీ యాక్ట్ కింద సాయి ధరమ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం...
మెగా హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ బైక్ డ్రైవ్ చేస్తూ సాయిధరమ్ తేజ్ కింద పడిపోయారు. ప్రమాదంలో తీవ్ర గాయాలవడంతో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నం.45, కేబుల్ బ్రిడ్జి మార్గంలోని కోహినూర్ హోటల్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే సాయిధరమ్ తేజ్‌ను స్థానికులు మెడికవర్ ఆస్పత్రికి చేర్చారు. ప్రమాదంలో సాయిధరమ్ తేజ్ కుడి కన్ను,ఛాతి,పొట్ట భాగంలో గాయాలయ్యాయి. ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో తేజ్ కోలుకుంటున్నాడు. అతివేగమే ప్రమాదానికి కారణమని మాదాపూర్ సీఐ తెలిపారు.నిర్లక్ష్యంగా,రాష్ డ్రైవింగ్ చేసినందుకు సాయి ధరమ్ తేజ్‌పై కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications