అసలేం జరిగిందంటే..: ఈడీ షాక్‌పై 'సాక్షి', ఆ మూడు ఛానళ్లకు నోటీలిస్తామని..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని సాక్షి మీడియా ఆరోపించింది.
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని సాక్షి మీడియా ఆరోపించింది.
జగన్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులతో సంబంధమున్న కంపెనీలపై ఈడీ దాడులు నిర్వహించినట్లు శనివారం ప్రకటించిందని వార్తలు వచ్చాయి. దీనిపై సాక్షి మీడియా ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈడీ శనివారం ఇచ్చిన రెండు ట్వీట్లను పట్టుకొని ఎల్లో మీడియా ఛానళ్లు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 9, ఈటీవీ రసవత్తర కథను అల్లాయని, అసలు ఈడీ ఏం చెప్పిందో ఎవరిని ఉద్దేశించి చెప్పిందో కూడా పట్టించుకోకుండా తప్పుడు కథనాలు ప్రసారం చేశాయని పేర్కొంది.

అసలు ఏం జరిగిందంటే..
మనీ లాండరింగ్ కేసులో అసలు ఏం జరిగిందో సాక్షి మీడియా చెప్పే ప్రయత్నం చేసింది. 'మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం చగన్ భుజబల్, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నందున్న యాదవ్ సింగ్, ఏపీప్రతిపక్ష నేత జగన్, ఇతర కేసుల్లో ఆరోపణలు వచ్చిన ఏజీఎస్ ఇన్ఫోటెక్, రాజేశ్వర ఎక్స్‌పోర్ట్స్, ఇలా పలు సంస్థలు, వ్యక్తులకు చెందిన షెల్ కంపెనీల్లో సోదాలు నిర్వహించినట్లు ఈడీ ట్వీట్ చేసింది.
వివిధ అంశాలకు సంబంధించి తాము సోదాలు జరిపిన సంస్థలు దేశవ్యాప్తంగా 300 వరకు ఉంటాయని మరో ట్వీట్లో పేర్కొంది. నిజానికి ఇందులో రాజేశ్వర్ ఎక్స్‌పోర్ట్స్ అనే సంస్థ యారో గోల్డ్ జ్యూయలరీ ప్రయివేటు లిమిటెడ్ అధిపతిది. ఈ సంస్థ ద్వారా వందల కోట్లు లాండరింగ్ జరిగిందని ఈ నెల మొదట్లోనే ఈడీ ప్రకటించింది. దానికి సంబంధించి కొందరిని అరెస్టు చేసింది. తాజాగా దీనికి చెందిన మరికొన్ని కంపెనీల్లో సోదాలు జరిపినట్లు ప్రకటిచింది. ఎన్ఆర్‌హెచ్ఎం, చగన్ భుజబల్ వ్యవహారాలు కూడా ఇది వరకు ఈడీ పేర్కొన్నవే.' అని పేర్కొంది.
ఈడీ ట్వీట్లను పట్టుకొని రాజేశ్వర ఎక్స్‌పోర్ట్స్ కంపెనీతో జగన్‌కు సంబంధాలున్నాయని, అదంతా ఈడీ చెప్పిందని, ఈ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ జరిగిందని, ఇంకా ఏవేవో పచ్చి అబద్దాలను ఎల్లో మీడియా రాసిందని పేర్కొంది.

మూడు చానళ్లకు లీగల్ నోటీసులు
రాజేశ్వర్ ఎక్స్‌పోర్ట్స్ అనే కంపెనీ పేరు కడా తమ క్లయింటుకు తెలియదని, అలాంటప్పుడు ఆ కంపెనీతో సంబంధాలు అంటగడుతూ కథనాలు ప్రసారం చేయడం ఉద్దేశ్యపూరితంగా తన క్లయింటు ప్రతిష్టను దెబ్బతీయడమేనని జగన్ తరఫు న్యాయవాదులు పేర్కొన్నారని కూడా రాసింది. ఏ మాత్రం ధ్రవీకరించకుండా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ప్రసారం చేసిన ఈ వార్తా కథనాల వెనుక తీవ్రస్థాయి దురుద్దేశాయులు ఉన్నట్లు వారు అభిప్రాయపడ్డారు. అందుకే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 9, ఈటీవీ ఛానళ్లకు లీగల్ నోటీసులు జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

జగతిలోకి..
కాగా, జగన్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసులతో సంబంధమున్న కంపెనీలపై దాడులు నిర్వహించినట్లు ఈడీ శనివారం ప్రకటించడంతో మరోసారి కోల్‌కత కంపెనీల వ్యవహారం తెరపైకి వచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. జగన్ కుటుంబానికి చెందిన జగతి పబ్లికేషన్స్‌లోకి గతంలో పలు కోల్‌కత కంపెనీల నుంచి పెట్టుబడుల రూపంలో నిధులు వచ్చాయి.
జగన్‌పై విచారణ ముగించిన సందర్భంగా కోర్టుకు సమర్పించిన మెమోలో సీబీఐ మొత్తం 16 కంపెనీల పేర్లను ప్రస్తావించింది. నిబంధనలు ఉల్లంఘించి, అక్రమాలకు పాల్పడిన ఈ కంపెనీల వ్యవహారాన్ని విచారించి, తగిన చర్యలు తీసుకునేందుకు ఆ విచారణ బాధ్యతను ఆదాయపన్ను శాఖ, ఈడీలకు బదిలీ చేసినట్లు సీబీఐ మెమోలో పేర్కొంది.
ఆ మెమోలో కోల్‌కత కేంద్రంగా నమోదైన 15 కంపెనీలు, గౌహతి కేంద్రంగా నమోదైన ఒక కంపెనీ పేరును వెల్లడించింది. ఈ కంపెనీల నుంచి జగతిలోకి పెట్టుబడులు రావడం గమనార్హం.

మెమోలో సీబీఐ పేర్కొన్న కంపెనీలు ఇవే...
ఆర్టిలిజెన్స్ బయో ఇన్నోవేషన్స్, బే ఇన్‌లాండ్ ఫైనాన్స్, భాస్కర్ ఫండ్ మేనేజ్‌మెంట్, క్లిఫ్‌టాన్ పియర్స్‌సన్ ఎక్స్‌పోర్ట్స్, డెల్టాన్ ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్, గంగా బిల్డర్స్, గ్రోమోర్ ఫండ్ మేనేజ్‌మెంట్, న్యూఅవుట్‌లుక్ సెక్యూరిటీస్, శక్తి ఇస్పాత్ ప్రొడక్ట్స్, శివ్ లక్ష్మీ ఎక్స్‌పోర్ట్స్, స్టాక్‌నెట్ ఇంటర్నేషనల్, సూపర్ ఫైనాన్స్, కీర్తి ఎలక్ట్రో సిస్టమ్స్, ఇస్పా షీట్స్ (గౌహతి), సుగమ్ కమోడీల్, చాండిలీర్ ట్రాకాన్. ఈ సంస్థలు సీబీఐ మెమోలో పేర్కొన్న ఉన్నాయని తెలుస్తోంది.
తాజాగా ఈడీ సోమవారం కోల్‌కత కేంద్రంగా నమోదైన 50 కంపెనీలపై దాడులు నిర్వహించడం చర్చనీయాంశమైంది. జగతి పబ్లికేషన్స్‌లోకి కోల్‌కత కేంద్రంగా నమోదైన 22 కంపెనీల నుంచి రూ.195.70 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. 2008 నుంచి 2010 మధ్య కాలంలో ఈ కంపెనీలు రూ.10 ముఖవిలువ కలిగిన ఒక్కో షేరును రూ.350 ప్రీమియం చెల్లించి కొన్నాయి.
కోల్‌కత కంపెనీల ద్వారా జగతి పబ్లికేషన్స్‌లోకి వచ్చిన రూ.195.70 కోట్లతో కొన్న షేర్లన్నీ తర్వాత ముంబై కేంద్రంగా నమోదైన మూడు కంపెనీలకు బదిలీ కావడం గమనార్హం. జగన్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులతో సంబంధమున్న కంపెనీలపై దాడులు నిర్వహించామని తాజాగా ఈడీ ఓ ప్రకటనలో పేర్కొంది. కానీ ప్రత్యేకంగా జగన్ పేరు ప్రస్తావించలేదు.












Click it and Unblock the Notifications