TGSRTC బస్సుల్లో రౌండ్ ట్రిప్ బుకింగ్స్ పై ఛార్జీలు తగ్గింపు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రయాణికులను ఆకట్టుకునే క్రమంలో పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. బంపర్ ఆఫర్లను ప్రకటిస్తోంది. ప్రతి దసరా, సంక్రాంతి పండగ సీజన్‌లల్లో దీన్ని అమలు చేస్తోంది. తాజాగా మరో ఆఫర్‌ను ప్రకటించింది. రౌండ్ ట్రిప్ అడ్వాన్స్ టికెట్ బుకింగ్ చేసుకునే వారికి ప్రయాణ ఛార్జీలో 10 శాతం రాయతీ ఇవ్వాలని నిర్ణయించింది.
రానుపోను ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే, తిరుగు ప్రయాణంపై 10 శాతం డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. దూర ప్రాంతాలకు వెళ్లే వారు ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేసింది. టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం తమ అధికారిక వెబ్ సైట్ http://tsrtconline.in ని సందర్శించాలని సూచించింది. యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్నా ఈ 10 శాతం రాయితీ వర్తిస్తుంది.

గతంలో కూడా ఈ అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం. అప్పట్లో అది పరిమితంగా ఉండేది. హైదరాబాద్ - బెంగళూరు, హైదరాబాద్- విజయవాడ, హైదరబాద్- తిరుపతి వంటి రద్దీ మార్గాల్లో ప్రవేశపెట్టిన ఈ ఆఫర్ వల్ల ఆక్యుపెన్సీ రేషియో భారీగా పెరిగింది. ఫలితంగా దీన్ని మరింత విస్తరించింది. ఇటీవలే హైదరాబాద్ - బెంగళూరు మార్గంలో సూపర్ లగ్జరీ బస్సుల్లో ప్రయాణించే వారికి 20 శాతం రాయితీని ప్రకటించిన విషయం తెలిసిందే.
ప్రత్యేకించి- ముఖ్యంగా వారాంతాల్లో ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉండటంతో వారిపై ఆర్థిక భారాన్ని తగ్గించే ఉద్దేశ్యంతో ప్రయాణంలో డిస్కౌంట్ అందించాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఈ తాజా నిర్ణయం వల్ల ఒక్కో ప్రయాణీకుడికి కనీసం 50 నుంచి 100 రూపాయల వరకు ఛార్జీ భారం తగ్గే అవకాశం ఉంది. మరిన్ని వివరాల కోసం ప్రయాణీకులు TGSRTC కాల్ సెంటర్ నంబర్లను సంప్రదించవచ్చు.












Click it and Unblock the Notifications