"సేవ్ ఒర్జినల్ కాంగ్రెస్" - రేవంత్ పై సీనియర్ల తిరుగుబాటు: హైకమాండ్ కు అల్టిమేటం..!!
టీపీసీసీ చీఫ్ రేవంత్ పైన సీనియర్లు తిరుగుబాటు చేసారు. రేవంత్ నిర్ణయాలపైన మండిపడ్డారు.సేవ్ కాంగ్రెస్ నినాదంతో ఢిల్లీ వెళ్లాలని డిసైడ్ అయ్యారు. వలస వచ్చిన నేతలు వర్సస్ ఒర్జినల్ నేతల మధ్య యుద్దంగా ప్రకటించారు. టీడీపీ నుంచి వచ్చిన నేతల పెత్తనం సహించమని సీనియర్లు తేల్చి చెప్పారు.
పీసీసీ చీఫ్ తో సమాన హోదా ఉన్న సీఎల్పీ లీడర్ కు లెక్క లేదంటూ భట్టీ వాపోయారు. ఒర్జినల్ కాంగ్రెస్ వాదులమంతా ఏకమవుతామంటూ పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ స్పష్టం చేసారు. మొత్తంగా టార్గెట్ రేవంత్ గా సీనియర్లు అందరూ ఒక్కటవటం తెలంగాణ కాంగ్రెస్ లో కలకలానికి కారణమవుతోంది.

రేవంత్ పై సీనియర్లు సీరియస్..
తెలంగాణ కాంగ్రెస్ లో భారీ కుదుపు. ఇప్పటి వరకు కోల్డ్ వార్ సాగుతున్న తెలంగాణ కాంగ్రెస్ లో తిరుగుబాటు మొదలైంది. వలసవాదులు వర్సస్ ఒర్జినల్ కాంగ్రెస్ అనే నినాదం తెర మీదకు తెచ్చారు. హైకమాండ్ వద్దకు సేవ్ ఒర్జినల్ కాంగ్రస్ పేరుతో వెళ్లాలని నిర్ణయించారు. తాజాగా టీపీసీసీలో జరిగిన కమిటీ నియమాకాల పైన కాంగ్రెస్ సీనియర్లు ఆగ్రహంతో ఉన్నారు.
సీనియర్లను - ఒర్జినల్ పార్టీ నేతలను పక్కన పెట్టి టీడీపీ నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేసారంటూ మండిపడ్డారు. ఏడాదిన్నార కాలంగా తమ మద్దతు దారులతో సొంత పార్టీ నేతల పైనే విమర్శలు పోస్టింగ్ లు చేయిస్తున్నారంటూ సీఎల్పీ నేత భట్టి ఆరోపించారు. కాంగ్రెస్ లోని బలమైన నాయకులను బలహీన పర్చి.. హస్తగతం చేసుకోవటం లేదా మరొకరికి అందించాలనే కుట్ర జరుగుతోందంటూ భట్టి సంచలన వ్యాఖ్యలు చేసారు.

టీడీపీ నేతల పెత్తనంలో పని చేయలేం
తాము పుట్టింది కాంగ్రెస్ లో..మరణించేది కాంగ్రెస్ లోనే అని పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ స్పష్టం చేసారు. తాను గతంలో టీపీసీసీ చీఫ్ గా పని చేసానని..తనకు ఒక వర్గం ఉన్నా.. పార్టీ వారికే ప్రాధాన్యత ఇచ్చానని గుర్తు చేసారు. కానీ, ఇప్పుడు తన వారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ పరోక్షంగా రేవంత్ పైన మండిపడ్డారు. కమిటీల నియామకాల విషయంలో సీనియర్లను అన్యాయం జరిగిందన్నారు.
కమిటీల్లో జరిగిన నియమకాల్లో టీడీపీ నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇవ్వటం పైన ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఒర్జినల్ కాంగ్రెస్ వాదులమంతా ఒక్కటవుతామని స్పష్టం చేసారు. డీసీసీల నియామకంలో జరిగిన అన్యాయం వివరించే ప్రయత్నం చేసారు. ఒర్జినల్ కాంగ్రెస్ నేతలను వలస నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. సీనియర్లంతా పరోక్షంగా రేవంత్ ను టార్గెట్ చేస్తూ దాదాపు తిరుగుబాటు ప్రకటించారు. తీన్మార్ మల్లన్న తమను పార్టీ కోవర్టులుగా పేర్కొంటూ చేసిన పోస్టింగ్ లను ఉత్తమ్ ప్రశ్నించారు. బలమైన నేతలను బలహీన పర్చి..పార్టీని వశం చేసుకోవాలనేది వారి ప్రయత్నమని ఉత్తమ్ వ్యాఖ్యానించారు.

నాలుగు పార్టీలు మారిన చరిత్ర కాదంటూ..
తాము తొలి నుంచి కాంగ్రెస్ లోనే ఉన్నామని.. తాము నాలుగు పార్టీలు మారి కాంగ్రెస్ లోకి రాలేదని పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. తాజా కమిటీల విషయంలో మాత్రం హైకమాండ్ తో తేల్చుకోవాలని నిర్ణయించారు. కమిటీల నియామకం సమయంలో తన ప్రమేయం లేకుండానే నిర్ణయాలు జరిగాయని భట్టి విక్రమార్క స్పష్టం చేసారు.
కమిటీలో 108 పేర్లు ప్రకటిస్తే 60 శాతం టీడీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వటం పైన ప్రశ్నించారు. పదవులు రాలేదనే ఆవేదన ఉన్న నేతలతో ఏకీభవిస్తున్నట్లుగా భట్టి చెప్పుకొచ్చారు. తామంతా ఒరిజనల్ కాంగ్రెస్ గా నేతలు చెప్పుకొచ్చారు. జరిగిన నష్టానికి తాను మసస్థాపానికి గురైనట్లుగా భట్టి చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ మూల స్తంభాలను కావాలనే టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. దీంతో, నేరుగా రేవంత్ పేరు ఏ నేత ప్రస్తావించకపోయినా.. ఇదంతా రేవంల్ పైన సీనియర్ల తిరుగుబాటుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక, ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ ఏం చేయబోతుందనేది ఉత్కంఠ పెంచుతోంది.












Click it and Unblock the Notifications