సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు: ఈ రూట్ లో
Special Trains: ఇంకో మూడు రోజుల్లో క్రిస్మస్ పండగ రాబోతోంది. ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చీలన్నీ ముస్తాబు అయ్యాయి. క్రిస్మస్ కోలాహలం నెలకొంది. చర్చిలన్నింటినీ కూడా రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఆయా చర్చిల్లో ఆనవాయితీ ప్రకారం.. క్రీస్తు జనన వృత్తాంతం తెలియజేసేలా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. 24వ తేదీ అర్ధరాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభం కానున్నాయి.
తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో వెలిసిన ప్రఖ్యాత వేళాంకణి మేరీ మాత ఉత్సవాలు కూడా ఆరంభం కానున్నాయి. ఆరోగ్యమాతను దర్శించడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వేళాంకణికి వెళ్తుంటారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లు పట్టాలెక్కనున్నాయి. సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న దక్షిణ మధ్య రైల్వే, నైరుతి రైల్వే, సదరన్ రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకుని రావడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు సికింద్రాబాద్ నుంచి వేళాంకణికి రెండు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. దీనికి సంబంధించిన టైమ్ టేబుల్ ను కూడా విడుదల చేశారు. ఈ రైళ్లు ఏపీ మీదుగా వేళాంకణికి రాకపోకలు సాగించనున్నాయి. అడ్వాన్స్ బుకింగ్ సైతం ఆరంభమైంది. ఈ నెల 23వ తేదీన అంటే మంగళవారం ఈ ప్రత్యేక రైలు పట్టాలెక్కుతుంది. 25వ తేదీన మళ్లీ తిరుగుముఖం పడుతుంది.
ఈ నెల 23న సాయంత్రం 7: 25 నిమిషాలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరే నంబర్ 07407 ప్రత్యేక రైలు మరుసటి రోజు సాయత్రం 5: 30 గంటలకు వేళాంకణికి చేరుకుంటుంది.
ఈ నెల 25వ తేదీన గురువారం ఉదయం 8 గంటలకు వేళాంకణి నుంచి బయలుదేరే నంబర్ 07408 ప్రత్యేక రైలు మరుసటి రోజు తెల్లవారు జామున 6:10 నిమిషాలకు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది.
చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, చెన్నై ఎగ్మూర్, తాంబరం, చెంగల్పట్టు, మేల్ మరువత్తూరు, విల్లుపురం, తిరుపాద్రిపులియూర్, చిదంబరం, మైలాడుతురై, కరైకల్, నాగూర్, నాగపట్టణం మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.












Click it and Unblock the Notifications