సికింద్రాబాద్ నుంచి ఈ రూట్‌లో రైలు రద్దు
Trains cancellation: నైరుతి రుతుపవనాల రాక ప్రభావం కనిపిస్తోంది. ఈ సీజన్‌లో సకాలంలో రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయి. అంచనా వేసిన దానికంటే ఒక రోజు ముందే అంటే ఈ నెల 31వ తేదీ నాటికి అవి కేరళ వద్ద తీరాన్ని తాకనున్నట్లు ఇప్పటికే వాతావరణం కేంద్రం అంచనా వేసింది. అనంతరం రెండు వారాల వ్యవధిలో దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరిస్తాయి.
దీనికి అనుగుణంగా కేరళ, కర్ణాటక, తమిళనాడుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి కూడా. ఈ రెండు రాష్ట్రాల తీర ప్రాంత జిల్లాల్లో ఆశించిన స్థాయికంటే అధికంగా వర్షపాతం నమోదవుతూ వస్తోంది. జూన్ 5వ తేదీన ఏపీ, తెలంగాణపై రుతుపవనాల ప్రభావం ఉండొచ్చంటూ వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా వర్షాలు ఏ స్థాయిలో కురుస్తాయనే విషయంపై వాతావరణ కేంద్రం అంచనాలను సైతం విడుదల చేసింది. దేశంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. ఈ సారి వర్షాలకు ఎలాంటి లోటూ ఉండబోదని భరోసా ఇచ్చింది.
జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబర్.. మధ్యకాలంలో ఆశించిన దాని కంటే అధికంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు మృత్యుంజయ మహాపాత్ర. నిర్ణీత సమయం కంటే ఒక రోజు ముందే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని, అనంతరం అవి చురుగ్గా కదలడానికి అనువైన వాతావరణం ఉందని అంచనా వేసినట్లు వెల్లడించారు. జూన్ 10- 15 తేదీల మధ్య రుతుపవనాలు విస్తరిస్తాయని అన్నారు.
రుతుపవనాలు తీరాన్ని తాకక ముందే కేరళలో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. రాజధాని తిరువనంతపురం సహా కోచి, కొల్లం, కొట్టాయం, పత్తనంథిట్ట, ఎర్నాకుళం, త్రిశూర్, కోజికోడ్, పాలక్కాడ్, మలప్పురం, కాలికట్, కన్నూర్, కాసర్‌గాడ్.. ఇలా అన్ని ప్రాంతాల్లోనూ ఏకధాటిగా వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సికింద్రాబాద్ నుంచి కొల్లం వెళ్ల ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశారు. బుధవారం సికింద్రాబాద్ నుంచి కొల్లం బయలుదేరి వెళ్లాల్సిన నంబర్ 07193, ఈ నెల 31వ తేదీన కొల్లం నుంచి సికింద్రాబాద్‌కు రావాల్సిన నంబర్ 07194 ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
ఖాజీపేట్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, నెల్లూరు, గూడూరు, రేణిగుంట జంక్షన్, కాట్పాడి, జోలార్‌పేట్, సేలం, ఈరోడ్, కోయంబత్తూర్ జంక్షన్, పాలక్కాడ్ జంక్షన్, త్రిశూర్, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, తిరువళ్లా, చెంగన్నూర్, మావెలికార, కాయంకుళం జంక్షన్ మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.












Click it and Unblock the Notifications