స్వప్నలోక్ కాంప్లెక్స్ ప్రమాద ఘటను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు: వారికి నోటీసులు
హైదరాబాద్: సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్(Swapna Lok Complex)లో ఇటీవల జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటనను తెలంగాణ హైకోర్టు సుమోటో పిల్‌గా స్వీకరించింది. ప్రమాద తీవ్రత, కారణాలను విశ్లేషిస్తూ పత్రికల్లో ప్రచురితమైన కథనాలపై హైకోర్టు సుమోటోగా స్పందించింది. కాగా, మార్చి 16న స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించిన విషయం విధితమే.
తెలంగాణ సీఎస్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్, డీజీపీ, హైదరాబాద్ సీపీ, అగ్నిమాపక శాఖ డీజీ, హైదరాబాద్ కలెక్టర్, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చింది ఉన్నత న్యాయస్థానం. మరోవైపు, ఈ అగ్ని ప్రమాదం ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు.. స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న క్యూనెట్ సంస్థ అక్రమాలు తెరపైకి వచ్చాయి.

అధిక కమీషన్లు ఆశచూపి అమాయకుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు పలువురు బాధితులు మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈడీ రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే క్యూనెట్ సంస్థకు చెందిన రూ. 137 కోట్లను ఈడీ అధికారులు స్తంభింపజేశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
కాగా, స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించినవారిలో క్యూనెట్ కోసం పనిచేస్తున్న ఉద్యోగులే ఉండటం గమనార్హం. మరణించినవారంతా యువతీయువకులే. క్యూనెట్ సంస్థ కార్యకలాపాలపై దర్యాప్తు జరుగుతున్నప్పటికీ.. ఈ సంస్థ పేరు మార్చుకుని ఇలాంటి కార్యకలాపాలే పాల్పడుతోందని తెలుస్తోంది. ఈ అగ్ని ప్రమాద ఘటనతోనే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాగా, క్యూనెట్ అక్రమాలపై ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications