మాజీ మంత్రి సమ్మయ్య కన్నుమూత: కేసీఆర్ దిగ్భ్రాంతి
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి బొచ్చు సమ్మయ్య (78) కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం హన్మకొండలోని తన నివాసంలో బాత్రూంలో జారిపడడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆగస్టు 9న హైదరాబాద్‌కు తరలించారు.
నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. పరకాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండుసార్లు మంత్రిగా పనిచేశారు.

సమ్మయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సమ్మయ్యకు పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని ఆదేశించారు. కాగా, మంగళవారం పరకాలలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
వరంగల్ జిల్లా పరకాలకు చెందిన సమ్మయ్య 1979లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. పీవీ నరసింహరావు హయాంలో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యునిగా సేవలందించారు. సమ్మయ్య కుటుంబసభ్యులను పలువురు కాంగ్రెస్ నేతలు పరామర్శించారు.












Click it and Unblock the Notifications