కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన జీవన్ రెడ్డి
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన జగిత్యాల జనగర్జన సభా వేదికగా బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు స్వయంగా గులాబీ కండువా కప్పి జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డితో పాటు దాదాపు 40 మంది అనుచరులు కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు.
జీవన్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా బీఆర్ఎస్లో చేరారు. వారిని కూడా గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యంగా జగిత్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ పర్వీన్ భర్త మున్నాభాయ్తో పాటు పలువురు కౌన్సెలర్ల భర్తలు కూడా బీఆర్ఎస్ లో చేరారు. వారిలో రమేష్ రావు, గాజుల రాజేందర్, గాజుల మహేష్, రజనీకాంత్, వదినని రామ్మోహన్, జగన్ రెడ్డి, మేక పవన్, పద్మావతి తదితరులు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భావం సమయంలోనే తనను బీఆర్ఎస్ పార్టీలో చేరాలని కేసీఆర్ ఆహ్వానించారని వెల్లడించారు. కేసీఆర్ అంటే తనకు మొదటి నుంచి అభిమానం ఉందన్నారు. కాంగ్రెస్ చూపించిన వివక్ష నేపథ్యంలోనే ఈ పార్టీలో చేరానని వెల్లడించారు. క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా కాంగ్రెస్లో కొనసాగానన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలన్నింటిని ఈ ప్రభుత్వం అమలు చేయడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధును ఎగ్గొట్టిందని మండిపడ్డారు. తన ప్రజాజీవితంలో దీనిని ఓ మలుపుగా భావిస్తున్నానన్నారు.
నా ఉసురు పోసుకున్నారు: జీవన్ రెడ్డి ఆవేదన
కాంగ్రెస్ పార్టీలో తాను ఎదుర్కొన్న అంతర్గత అవమానాలపై జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. "గడిచిన 20 నెలలుగా కాంగ్రెస్ నేతలు నా ఉసురు పోసుకున్నారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా 40 ఏళ్లు పార్టీ బలోపేతానికి రక్తం ధారపోస్తే.. నా జీవితం చివరి దశలో నాకు దక్కింది మానసిక క్షోభ మాత్రమే" అని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. ఇంతటి వివక్షను భరించలేకనే, ఆత్మగౌరవం కోసం పార్టీ వీడాల్సి వచ్చిందని, ఈ క్లిష్ట సమయంలో కేసీఆర్ తనకు అండగా నిలిచారని ఆయన కొనియాడారు.
కేసీఆర్ పాలనపై ప్రశంసల జల్లు
తనకు ఏ పదవుల మీద ఆశ లేదని స్పష్టం చేసిన జీవన్ రెడ్డి, తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యమని పేర్కొన్నారు. "ఉద్యమ రథసారథిగా తెలంగాణ సాధించిన కేసీఆర్ తో కలిసి పనిచేయడం నా అదృష్టం. జగిత్యాల జిల్లాను ఏర్పాటు చేసి, మెడికల్ కాలేజీ ఇచ్చి, బోర్నపల్లి ప్రాజెక్టుకు రూ. 70 కోట్లు మంజూరు చేసిన ఘనత కేసీఆర్ దే" అని ప్రశంసించారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మీ, రైతుబంధు వంటి పథకాలు ప్రపంచానికే ఆదర్శమని ఆయన గుర్తు చేశారు.
కాంగ్రెస్ వైఫల్యాలపై ధ్వజం
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రైతులకు అందాల్సిన రైతుబంధు నిధులను ఎగ్గొట్టారని మండిపడ్డారు. కల్యాణలక్ష్మీ పథకం కింద తులం బంగారం ఇస్తామన్న హామీని గాలికి వదిలేసి, ఉన్న పథకాన్నే నీరుగారుస్తున్నారని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు.
జగిత్యాలలో కొత్త రాజకీయ మలుపు
జీవన్ రెడ్డి చేరికతో జగిత్యాల జిల్లాలో బీఆర్ఎస్ బలపడటమే కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లోనూ ఒక బలమైన సంకేతం వెళ్లింది. కేసీఆర్ తో తనకు మొదటి నుంచీ ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న జీవన్ రెడ్డి, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రానికి పట్టిన శని వదులుతుందని ఆయన ఆకాంక్షించారు.












Click it and Unblock the Notifications