మద్యం సీసాలు ఖాళీ చేశారు: ఇళ్లను దోచుకెళ్లారు
హైదరాబాద్: దసరా పండుగకు ఊరెళ్లినవారి ఏడు ఇళ్లను దొంగలు గుల్ల చేశారు. హైదరాబాదులోని ఎల్బీ నగర్ జనప్రియ కాలనీలోని నర్సింహా రెడ్డి ఇంట్లో దొంగలు మద్య సీసాలను ఖాళీ చేసి, తాపీగా పది వేల రూపాయలు, రెండు తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు.
ఎల్బీ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని పలు ఇళ్లలో చోరీలు జరిగాయి. ఇంటి తాళాలు పగులగొట్టి నగదు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. ఎల్‌బి నగర్ సర్కిల్ పరిధిలోని జనప్రియ, ఇంద్రప్రస్థ కాలనీల్లోని పలు ఇళ్ళల్లో దొంగలు అందిన కాడికి దోచుకెళ్లారు. దసరాకు వరుస సెలవులు రావడంతో కొందరు పండుగకు వెళ్చొచ్చినవారు తమ ఇండ్లల్లో దొంగలు పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేయగా మరికొన్ని ఇళ్ల తాళాలు పగులగొట్టబడి ఉన్నాయి.
జనప్రియ కాలనీలో ప్లాట్ నెంబర్ 144కు చెందిన సూరారం రాజేశ్వరి ఈ నెల 20న పండగకు ఊరెళ్లింది. తిరిగి శుక్రవారం ఉదయం రాగా ఇంటి తలుపు, తాళం తెరచి ఉంది. ఇంట్లోకెళ్లి చూడగా నాలుగు తులాల బంగారు ఆభరణాలు అపహరించబడ్డాయని ఎల్‌బి నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాపు జరుపుతున్నారు. అదేవిధంగా మరికొన్ని ఇళ్ల తాళాలు పగులగొట్టబడి ఉన్నాయని, అయితే ఇంటి యజమానులు వస్తేగానీ జరిగిన దొంగతనాలు తెలియవని పోలీసులు తెలిపారు.
కర్మన్‌ఘాట్ పద్మానగర్ కాలనీలో దొంగులు రాంబాబు, రమేష్ కుటుంబాలకు చెందిన రెండు ఇళ్లలో కూడా చోరీలు జరిగాయి. వనస్థలిపుర పోలీసు స్టేషన్ పరిధిలోని విజయపురి కాలనీ, హస్తినాపురం కానీల్లో కూడా చోరీలు జరిగాయి.












Click it and Unblock the Notifications