అది రాజయ్య వ్యక్తిగతం, టిఆర్ఎస్ నేతలను కొడుతున్నారు: షబ్బీర్
వరంగల్/ కరీంనగర్: మాజీ పార్లమెంటు సభ్యుడు సిరిసిల్ల రాజయ్య ఇంట్లో జరిగిన సంఘటనలు ఆయన వ్యక్తిగతమని కాంగ్రెసు తెలంగాణ నేత షబ్బీర్ అలీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నేతలపై ఆయన శనివారం మీడియా ప్రతినిధుల వద్ద విరుచుకుపడ్డారు. తెలంగాణ ద్రోహులంతా మంత్రులయ్యారని ఆయన అన్నారు.
టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులను, విద్యార్థులను పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని చెప్పుతో కొట్టారని, ఓ ఎమ్మెల్యేలను గ్రామంలోకి రానీయలేదని ఆయన అన్నారు. టిఆర్ఎస్ నాయకులను ప్రజలు తరిమి కొడుతారని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల నాటికి టిఆర్ఎస్ నేతలు గ్రామాల్లో తిరగలేరని ఆయన అన్నారు.

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిపై ఓ రైతు చెప్పు విసిరిన ఘటన టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనమని పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై 16 నెలలకే ఇంత వ్యతిరేకత వస్తుందనుకోలేదని అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితమయ్యారన్నారు. అలాగే భవిష్యత్ లో ప్రభుత్వంపై మరింత వ్యతిరేకత తప్పదన్నారు.
కరీంనగర్ జిల్లాలో వెల్గటూరు మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాటర్‌గ్రిడ్ పథకంలో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని, అఖిలపక్ష సమావేశం పెడితే నిరూపిస్తామని సవాల్ విసిరారు.
కరువు మండలాలను ఎందుకు ప్రకటించడం లేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వరంగల్ ఎన్నికలు ఎందుకు వచ్చాయో కేసీఆర్ చెప్పాలని నిలదీశారు. వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌కు ప్రజలు ఓటు వేయరని నాగం జనార్దన్ రెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications