ఆత్మరక్షణ కాల్పులపై అనుమానం? డీజీపీకి TSHRC డెడ్‌లైన్!
నిజామాబాద్ జిల్లాలో జరిగిన షేక్ రియాజ్ ఎన్‌కౌంటర్ మరణంపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(TSHRC) సుమోటోగా కేసు నమోదు చేసింది. వివిధ వార్తా పత్రికలలో ప్రచురితమైన కథనాల నివేదికల ఆధారంగా కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది.
కేసు నేపథ్యం ఏమిటంటే?
పోలీస్ కానిస్టేబుల్ ఎం.ప్రమోద్ కుమార్ హత్యకు సంబంధించిన కేసులో నిందితుడైన మృతుడు షేక్ రియాజ్‌ను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం రియాజ్ నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆరోపణల ప్రకారం, రియాజ్ ఆస్పత్రి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో సాయుధ రిజర్వ్ కానిస్టేబుల్ వద్ద ఉన్న సర్వీస్ ఆయుధాన్ని లాక్కునేందుకు ప్రయత్నించాడని, ఆ తర్వాత పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారని తెలుస్తోంది. ఈ కాల్పుల ఫలితంగా షేక్ రియాజ్ అక్కడికక్కడే మరణించినట్లు సమాచారం.

మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు
ఈ ఎన్‌కౌంటర్ మరణంపై తీవ్రంగా స్పందించిన మానవ హక్కుల కమిషన్ ఈ సంఘటనకు దారితీసిన పరిస్థితులు, తదనంతర పరిణామాలపై స్పష్టమైన నివేదిక అందించాలని తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)ను ఆదేశించింది. ఈ సంఘటనకు దారితీసిని పరిస్థితులతో పాటు ఈ ఎన్‌కౌంటర్ మరణంపై ఏదైనా మెజిస్టీరియల్ లేదా జ్యుడీషియల్ విచారణ ప్రారంభమైందా, దాని ప్రస్తుత స్థితి ఏమిటి? అనే విషయాలను నివేదిక ద్వారా వెల్లడించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఎన్‌కౌంటర్ మరణాలకు సంబంధించి సుప్రీంకోర్టు, జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) జారీ చేసిన మార్గదర్శకాలు ఏ మేరకు పాటించబడ్డాయనేది కూడా స్పష్టంగా తెలియజేయాలని పేర్కొంది. సంబంధిత ఎఫ్ఐఆర్ (FIR), పోస్ట్‌మార్టం నివేదిక కాపీలు నివేదికలో పొందుపరచాలని ఆదేశించింది. ఈ పూర్తి నివేదికను 24.11.2025 తేదీలోగా సమర్పించాలని మానవ హక్కుల కమిషన్ తెలంగాణ డీజీపీకి గడువు విధించింది. ఈ సుమోటో కేసు నమోదుతో ఈ ఎన్‌కౌంటర్ సంఘటనపై మరింత లోతైన విచారణ జరిగే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications