ఓటుకు నోటు: నోటీసులిచ్చాక లోకేష్ డ్రైవర్ కొండల్ రెడ్డి అకౌంట్ క్లోజ్!
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఎసిబి నారా లోకేష్ డ్రైవర్ కొండల్ రెడ్డికి ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఆయన హాజరు కాలేదు. నోటీసులు జారీ చేసిన రోజునే కొండల్ రెడ్డి తన ఫేస్‌బుక్ అకౌంట్‌ను కూడా బ్లాక్ చేసినట్లు ఎసిబి గుర్తించినట్లుగా తెలుస్తోంది.
వరుసగా జరిగిన పరిణామాల దృష్ట్యా.. అజ్ఞాత ఆశ్రయం వ్యవహారంలో కఠినంగా వ్యవహరించాలన్న నిర్ణయానికి వచ్చింది. అయితే వరుసగా పంద్రాగస్టు, ఆదివారం సెలవు దినాలు రావడంతో సోమవారం ఎసిబి ఉన్నతాధికారులు సమావేశమై చర్చించనున్నారని సమాచారం.
ఆ తర్వాత ఓటుకు నోటు వ్యవహారంలో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలున్నాయి. అప్పుడు ఓటుకు నోటు కేసులో మరో కీలక మలుపు తిరగనుందని అంటున్నారు. కేసులో నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్య, కీలక ఆధారంగా మారిన జిమ్మిబాబు, కొండల్ రెడ్డిలకు కొంతమంది ఆశ్రయం ఇస్తునట్లుగా ఎసిబి ఇప్పటికే గుర్తించిందని చెబుతున్నారు.

ఇందులో ముఖ్యంగా ఏపీకి చెందిన రాజకీయ నాయకులతోపాటు ఆ రాష్ట్ర పోలీసులు ఉన్నారని గుర్తించింది. ఎసిబి నోటీసులు అందుకున్న నాటి నుంచి పరారీలో ఉన్న జిమ్మిబాబు ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో ఆశ్రయం పొందుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన ఓ టిడిపి నాయకుడి ఇంట్లో ఉన్నాడంటున్నారు.
అదేవిధంగా జిమ్మిబాబు తెలంగాణ నుంచి ఆంధ్రకు వెళ్లేందుకు వారే అన్ని ఏర్పాట్లు చేశారని ఎసిబి గుర్తించారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి పక్కా ఆధారాలను రాబట్టిందని తెలుస్తోంది. భారత శిక్షాస్మృతి ప్రకారం నేరస్తులు, నిందితులకు సహకరించడం, ఆశ్రయమివ్వడమూ నేరమే.
ఓటుకు నోటు కుట్ర బయటపడగానే మత్తయ్యను పోలీసుల కంటపడకుండా హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లారు. అలాగే మత్తయ్య పరారీలో ఉన్న నిందితుడు, అతడి కోసం ఎసిబి ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెలిసినప్పటికీ విజయవాడ పోలీసులు తెలంగాణ పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. ఈ వ్యవహారాన్ని ఎసిబి తీవ్రంగా పరిగణిస్తోంది.












Click it and Unblock the Notifications