తెలంగాణలో మారుతున్న సమీక"రణం" - కలిసొచ్చేదెవరికి..!!
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. బీజేపీ జోష్ తగ్గింది. కాంగ్రెస్ లో గతం కంటే భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. అధికార బీఆర్ఎస్ కు ఈ రెండు పార్టీలు మేమే పోటీ దారులమని ఇప్పటి వరకు ప్రకటించుకున్నారు. ఇప్పుడు అనూహ్యంగా కాంగ్రెస్ తెలంగాణ కంటే మెరుగైన స్థితిలోకి చేరిందనే అభిప్రాయం వినిపిస్తోంది. బీజేపీ నేతల మధ్య ఆధిపత్య పోరు కాంగ్రెస్ కు కలిసివస్తోంది. ఇదే కొనసాగి బీఆర్ఎస్ వర్సస్ కాంగ్రెస్ గా ఎన్నికల సమరం మారితే కలిసొచ్చేదెవరికి.
ఎన్నికల వేళ కీలక పరిణామాలు : తెలంగాణలో మరో మూడు నెలల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నిర్ణయాల్లో వేగం పెంచింది. రాజకీయంగా వ్యూహాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ తాజాగా రైతులు..ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డీఏ ప్రకటించారు.

నేడే, రేపో పీఆర్సీ ఏర్పాటు దిశగా నిర్ణయం జరగనుంది. మూడో సారి వంద సీట్లతో అధికారంలోకి వస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతీ సందర్భంలోనూ ధీమాగా చెబుతున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలు బీజేపీ, కాంగ్రెస్ వచ్చే ఎన్నిక ల్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితుల్లో మాత్రం స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.
బీజేపీని కాంగ్రెస్ డామినేట్ చేస్తోందా : కొద్ది రోజుల క్రితం వరకు తెలంగాణ బీఆర్ఎస్ వర్సస్ బీజేపీగా ఎన్నికల యుద్దం కనిపించింది. బీజేపీ అగ్రనేతలువరుసగా తెలంగాణలో పర్యటించి రాజకీయ వాతావరణం వేడి పెంచారు. కర్ణాటక ఎన్నికల తరువాత ఒక్క సారిగా పరిస్థితిలో మార్పు వచ్చింది. కాంగ్రెస్ నేతల్లో కర్ణాటక గెలుపు టానిక్ లా పని చేసింది. ఎలాగైనా తెలంగాణలోనూ అధికారంలోకి రావాలనే పట్టుదల మొదలైంది. నేతలంతా గతం కంటే భిన్నంగా కలిసి కట్టుగా పని చేస్తున్నారు.
ప్రస్తుతానికి కాంగ్రెస్ లో పరిణామాలు కేడర్ లోనూ ఉత్సాహం పెంచుతున్నాయి. కానీ, బీజేపీ కేంద్ర నాయకత్వం ఇదే తరహాలో చూస్తూ కూర్చొనే అవకాశం లేదు. రంగంలోకి దిగటం ఖాయం. మరి...అగ్రనేతల పర్యటనలు..కొత్త వ్యూహాలు ఫలిస్తే చివరి నిమిషంలో బీజేపీ పంజుకొనే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి.

ఎన్నికల్లో జరిగేదేంటి : కాంగ్రెస్ లో రేవంత్ పైన సీనియర్లకు ఆగ్రహం ఉన్నా..ప్రస్తుతం ఉన్న జోష్ లో బయట పడటం లేదు. ఎన్నికలు సమీపించే వేళ..టికెట్లు..మద్దతు దారులకు ప్రాధాన్యత సమయంలో సహజమైన కాంగ్రెస్ తీరు బయటకు వచ్చే అవకాశం ఉంది. అదే ఎలక్షన్ మేనేజ్ మెంట్ లో దిట్టలైన బీజేపీ అగ్రనాయకత్వానికి కలిసొచ్చే అవకాశం ఉంది. ఇటు బీఆర్ఎస్ మాత్రం ఈ రెండు పార్టీల్లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తోంది.
ఈ రెండు పార్టీలు ప్రభుత్వం పైన సహజంగా ఏర్పడే వ్యతిరేక ఓటును మాత్రమే చీల్చగలుగుతాయని లెక్కలు వేస్తోంది. ఈ రెండు పార్టీలు పోటీ పడటం ద్వారా.. మరోసారి తెలంగాణలో తమకు అధిఖాయం ఖాయమని ధీమాగా ఉంది. సర్వే నివేదికలు చెబుతున్న అంశాలు అవేనని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. దీంతో, రానున్న రోజుల్లో రాజకీయం మరింత ఆసక్తి కరంగా మారే ఛాన్స్ ఉంది












Click it and Unblock the Notifications