సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షుకు షాక్: తాత పాలనపై ట్రోల్స్!!
తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు తాజాగా చేసిన ఒక మంచి పని హిమాన్షు పై, తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలకు, ట్రోల్స్ కు కారణమైంది. కేశవనగర్ ప్రభుత్వ పాఠశాలకు కొత్త రూపును తీసుకురావడం కోసం హిమాన్షు రావు తన కళాశాలలో నిధులు సేకరించి గౌలిదొడ్డి కేశవ నగర్ లోని పాఠశాల ఆధునీకరణ పనులు చేయించారు.
నిన్న తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తో కలిసి పాఠశాలను ప్రారంభించిన హిమాన్షు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేశవాపూర్ స్కూల్ కి వచ్చినప్పుడు అన్ని సమస్యలే కనిపించాయని, అందుకే నిధులను సేకరించి విద్యార్థులకు ఉపయోగపడేలా ఈ స్కూల్ ని బాగు చేయాలని అనుకున్నానని తెలిపారు.

గత సంవత్సరం మొదటిసారి కేశవాపూర్ స్కూలుకు వచ్చినప్పుడు తన కళ్ళవెంట కన్నీరు వచ్చాయని, ఆడపిల్లలకు సరైన వాష్ రూమ్ లు లేవు. బయట పందులు ఉన్నాయని, మౌలిక సదుపాయాలు లేవని, అప్పుడు తాను అనుభవించిన బాధ మాటల్లో చెప్పలేనని పేర్కొన్నారు. అందుకే తాను నిధులు సేకరించి, తన తాత స్ఫూర్తితో ఆధునీకరణ పనులు చేయించానని తెలిపారు.
ఈ వ్యాఖ్యలే హిమాన్షు ను ట్రోల్ చెయ్యటానికి కారణమయ్యాయి. పదేళ్లుగా తాత ముఖ్యమంత్రి, తండ్రి మంత్రిగా ఉన్న ప్రభుత్వ స్కూళ్లను పట్టించుకోకపోవడం వల్ల ఈ దుస్థితి వచ్చిందని,సాక్షాత్తు తాత పాలనను మనవడు అద్దం పట్టినట్టు, కళ్ళకు కట్టినట్టు చెప్పాడని నెటిజన్లు హిమాన్షు వ్యాఖ్యలను ట్రోల్ చేస్తున్నారు.

అంతేకాదు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో టీజీవిపి తాజాగా హిమాన్షు వ్యాఖ్యలు నేపథ్యంలో వినూత్న నిరసన చేపట్టి, ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు హిమాన్షు దిష్టిబొమ్మకు సత్కారం చేశారు. గొప్ప పని చేశావు అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్ళు, కళాశాలలు మెరుగుపరచాలని ఈ మేరకు టీజీవిపి డిమాండ్ చేసింది.
కేవలం కేశవాపూర్ స్కూల్ మాత్రమే కాదు అన్ని స్కూళ్ళు మారుద్దాం, మీ తాతను నిలదీద్దాం అంటూ నినాదాలు చేసిన టీజీవిపి నాయకులు చాలా స్కూళ్ళ పరిస్థితి ఇదే విధంగా ఉందని, వాటి మాటేమిటి అంటూ ఆందోళన చేశారు. మొత్తానికి సీఎం మనవడు హిమాన్షు మంచి పని చేసినా సరే ట్రోల్స్ మాత్రం తప్పటం లేదు.












Click it and Unblock the Notifications