రాజీవ్ యువ వికాసం దరఖాస్తుదారులకు షాక్.. వారికి లోన్ గోవిందా!
తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం కల్పించడం కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధిని కల్పించడం కోసం రేవంత్ సర్కార్ తీసుకువచ్చిన ఈ పథకంలో దరఖాస్తుదారులు అందరు తమకు లబ్ది జరుగుతుందని భావిస్తున్నారు.
జూన్ రెండో తేదీన రాజీవ్ యువ వికాసం పథకంలో దరఖాస్తుదారులకు లోన్
అయితే ఇదే సమయంలో రాజీవ్ యువ వికాసం పథకం కోసం అప్లై చేసుకున్న వారికి ఒక షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. రాజీవ్ యువ వికాసంలో దరఖాస్తు చేసుకున్న వారికి 50 వేల నుంచి నాలుగు లక్షల వరకు సబ్సిడీతో కూడిన రుణాలను బ్యాంకులు మంజూరు చేయవలసి ఉంది. జూన్ రెండవ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు రుణాలను మంజూరు చేయాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది.

వారికి లోన్ కష్టమే
ఈ సంవత్సరం సుమారు 5 లక్షల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వ నిర్ణయించింది. అయితే రాజీవ్ యువ వికాసం పథకంలో దరఖాస్తు చేసుకున్న వారికి లోన్ రావాలంటే వారి సిబిల్ స్కోర్ కీలకంగా మారింది. సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నవారు, బ్యాంకు రుణాలు తీసుకుని చెల్లించని వారు, పర్సనల్ లోన్స్ , వ్యవసాయ, గృహ, వాహన రుణాలను తీసుకుని చెల్లించని వారి దరఖాస్తులను బ్యాంకర్లు తిరస్కరించే అవకాశం ఉంది.
అందరి సిబిల్ స్కోర్ లను తనిఖీ చేయనున్న బ్యాంకర్స్
తక్కువ సిబిల్ స్కోర్ ఉన్నవారిని మినహాయించి మిగతా వారికి మాత్రమే రాజీవ్ యువ వికాసం రుణాలను ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇక ఇదే సమయంలో దరఖాస్తుదారులు అందరి సిబిల్ స్కోర్ ను తనిఖీ చేయడం కోసం బ్యాంకర్లు ప్రభుత్వ నుండి ఒక్కొక్క దరఖాస్తుకు 100 రూపాయల నుండి 200 రూపాయల వరకు ఫీజు వసూలు చేయాలని నిర్ణయించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాయి.
రాజీవ్ యువ వికాసం పథకానికి అప్లై చేసిన 16 లక్షల మంది
ఇక రాజీవ్ వికాసం పథకానికి 16 లక్షల 25 వేల 441 దరఖాస్తులు రాగా, అన్ని దరఖాస్తుల సిబిల్ స్కోర్ పరిశీలించాలంటే దాదాపు ప్రభుత్వం బ్యాంకర్లకు 16 కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. ఇక స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో ప్రభుత్వం ఈ ఫీజును మినహాయింపు ఇవ్వాలని బ్యాంకర్లను కోరనుంది.
సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నవారికి షాక్
ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా రాజీవ్ యువ వికాసం పథకానికి బీసీల నుండి 5 లక్షల 35 వేల 666, ఎస్సీల నుండి 2 లక్షల 95 వేల 908, ఎస్టీల నుండి 1 లక్ష 39 వేల 112, ఈబీసీల నుండి 23,269, మైనారిటీల నుండి 1 లక్షా 7 వేల 681, క్రిస్టియన్ మైనారిటీల నుండి 2,689 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం పదహారు లక్షలకు పైచిలుకు దరఖాస్తులను బ్యాంకు సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్న వారు పోగా, అధికారుల అంచనా ప్రకారం మిగిలిన 60 శాతం మందికి రుణాలు మంజూరయ్యే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.












Click it and Unblock the Notifications