చీరలు కట్టుకుని.. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దివ్యాంగుల ఝలక్!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల కోసం అందించిన మహాలక్ష్మి పథకం రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు ఇబ్బందిని కలగజేస్తోంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు అందించడంతో గతంతో పోలిస్తే ప్రస్తుతం మహిళల ప్రయాణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఉచిత బస్సు కారణంగా మహిళలు ఎక్కువ సంఖ్యలో బస్సులలో ప్రయాణాలు చేస్తుంటే రద్దీ పెరగడం మాత్రమే కాకుండా ఈ బస్సులలో ప్రయాణాలు చేసే దివ్యాంగులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది.
దివ్యాంగుల వినూత్న నిరసన
ఇక ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడం కోసం దివ్యాంగులు తాజాగా ఒక వినూత్న నిరసన చేపట్టారు. చీరలు కట్టుకుని ఆర్టీసీ బస్సులు ఎక్కి రేవంత్ ప్రభుత్వం అందించిన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రశ్నించారు. ఆర్టీసీ బస్సులలో తమకు ఉచిత ప్రయాణం కల్పించాలని, ప్రత్యేక సీట్లు కేటాయించి తమకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కలిగించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ జిల్లాలోని దివ్యాంగులు వినూత్న నిరసన తెలియజేశారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో 30 లక్షల మంది దివ్యాంగులకు ఇబ్బంది
వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో కొందరు దివ్యాంగులు చీరలు కట్టుకొని ఆర్టిసి బస్సు ఎక్కి నిరసన తెలియజేశారు. ఆర్టీసీ బస్సులలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 30 లక్షల మంది దివ్యాంగులు ఆర్టీసీ బస్సు ఎక్కాలంటేనే ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉందన్నారు.
సీఎం రేవంత్ రెడ్డికి స్పెషల్ రిక్వెస్
ఆర్టీసీ బస్సులలో దివ్యాంగుల కోసం కేటాయించిన సీట్లలో కూడా మహిళలే కూర్చుంటున్నారని, దివ్యాంగుల కోసం ప్రతి బస్సులో మూడు సీట్లు కేటాయించాలని వారు కోరారు. దివ్యాంగులకు కేటాయించిన సీట్లలో వారు కాక ఎవరైనా కూర్చుంటే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేదా తమకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని వారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లను విజ్ఞప్తి చేశారు.
ఆర్టీసీ బస్సులలో నరకం చూస్తున్నామన్న దివ్యాంగులు
ఆర్టీసీ బస్సులు అందరికోసం ఏర్పాటు చేయబడ్డాయి అని, కానీ కేవలం మహిళలకే అన్నట్టు పరిస్థితి మారిందని దివ్యాంగులు లబోదిబోమంటున్నారు. దివ్యాంగుల కోసం కేటాయించిన సీట్లను సైతం మహిళలు కబ్జా చేస్తున్నారని, దీంతో దివ్యాంగులు ఆర్టీసీ బస్సులలో ప్రయాణించాలంటే నరకాన్ని చూస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
దివ్యాంగుల డిమాండ్ ఇదే
ఇప్పటికైనా ప్రభుత్వం దివ్యాంగుల గోడు అర్థం చేసుకొని తమకు ఇబ్బంది కలగకుండా చూడాలని, ఆర్టిసి బస్సులలో మూడు లేదా నాలుగు సీట్లను దివ్యాంగుల కోసం కేటాయించి, అందులో వారు మాత్రమే కూర్చునేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications